కుబ్రా సైట్‌ వర్సెస్‌ కంగనా టీం..

11 Aug, 2020 15:16 IST|Sakshi

తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఎప్పడూ ముందుంటారు. యువ హీరో సుశాంత్‌ మరణించినప్పటి నుంచి కంగనా, అమె బృందం సోషల్‌ మీడియాలో స్టార్‌ కిడ్‌లను లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడికి దిగుతున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌, అలియా భట్ వంటి వారిపై మండిపడుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, ఆయుష్మాన్‌ ఖురానా, దీపికా పదుకొనెను టార్గెట్‌ చేస్తూ వారిపై మాటల యుద్దానికి దిగారు. దీంతో ఆగ్రహానికి లోనైన రణ్‌బీర్‌, దీపికా అభిమానులు ట్విటర్‌లో #SuspendTeamKangana అనే హ్యష్‌టాగ్‌తో ఆమెపై మండిపడుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా నటి కుబ్రా సైట్‌ చేరారు. (క‌రీనా సినిమాల‌ను బాయ్‌కాట్ చేయాలి)

న‌టి కుబ్రా సైట్ సోమవారం కంగనాకు వ్యతిరేకంగా ట్విట్టర్‌లో ఈ సస్పెన్షన్‌కు నా మద్దతు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇతర నటులను లక్ష్యంగా చేసుకొని విమర్శించడం మానేయాలని ట్వీట్‌ చేశారు. ఇది ట్విట్ట‌ర్ ఇండియా కూడా చూస్తే చాలా బాగుంటుందంటూ సస్పెండ్‌ టీం కంగ‌నా హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. అయితే కుబ్రా ట్వీట్ చేసిన వెంటనే, కంగనా బృందం స్పందించింది. ‘ప్రియ‌మైన‌ కుబ్రాసైట్ మీరు, కంగనా సహోద్యోగులుగా స్నేహితులుగా చాలాకాలం ఉన్నారు. కానీ మీరు ఆమె మాట్లాడే స్వేచ్ఛకు వ్యతిరేకంగా ప్రచారం ఎందుకు చేస్తున్నారు. ఆమె మీకు ఏ నష్టం కలిగించింది? మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది? మీరు కొద్దిమందిని సంతోషపెట్టాలనుకుంటున్నారా? ’ అంటూ కంగ‌నా టీం త‌మ ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. (ఆయుష్మాన్‌పై కంగ‌నా ఫైర్)

అలాగే కంగనా టీం చేసిన ట్వీట్‌పై మరోసారి కుబ్రా స్పందించారు. ఇది తను వ్యక్తిగతంగా చేయడం లేదని స్పష్టం చేశారు.‘ఇది అస్సలు వ్యక్తిగతమైనది కాదు. టీం కంగనా రనౌత్ మీరు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా విషపూరితమైనది. నేను మిమ్మల్ని అన్‌ఫాలో చేశాను. అలాగే రిపోర్ట్‌ చేశాను. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా అడిగేది ఏంటంటే దయతో ఉండండి. బాధ్యత వహించండి. నేను వ్యక్తిగత దూషణలు చేయడం లేదు. మీరు కూడా అలా చేయరని ఆశిస్తున్నాను.’ అంటూ ముగించారు.

మరిన్ని వార్తలు