బాలీవుడ్‌లో ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ

21 Feb, 2021 10:04 IST|Sakshi
కుమార్‌ సాను, మీనాక్షి, రాజ్‌ కుమార్‌

జబ్‌ కోయీ బాత్‌ బిగడ్‌ జాయే.. జబ్‌ కోయీ ముశ్కిల్‌ పడ్‌ జాయే..
తుమ్‌ దేనా సాథ్‌ మేరా.. ఓ హమ్‌నవా..
(అనుకున్నది జరక్కపోయినా.. అవాంతరాలు ఎదురైనా నా తోడు వీడొద్దు నేస్తమా!) 
ఈ పాట జుర్మ్‌ (1990) సినిమాలోనిది. పాడింది కుమార్‌ సాను, నటించింది మీనాక్షి శేషాద్రి. జీవితంలోనూ మీనాక్షి తోడు కావాలనుకున్నాడు... కానీ కష్టకాలంలో ఆ ఇద్దరూ ఒకరికొకరు తోడు కాలేకపోయారు. 
అసలు ఆ ప్రేమ ఎలా మొదలైంది... ఆ కష్టకాలం ఏంటి? వివరాలు..

జుర్మ్‌ సినిమా ప్రీమియర్‌ షోలో మీనాక్షిని చూశాడు కుమార్‌ సాను. ఆమె అందానికి అతని మనసు చెదిరింది. ఆమె నవ్వు అతనికి నిద్రలేకుండా చేసింది కొన్ని వారాలు. ఆమె ఇంటి ఫోన్‌ నంబర్‌ సంపాదించాడు. సంభాషణ కలిపాడు. ఒంటరిగా కలుసుకునే ప్రయత్నమూ చేశాడు. ఫలించింది. మీనాక్షి .. కుమార్‌ను కలిసింది. ఆమె అంటే తనకెంత ప్రేమో వివరించాడు. ఎప్పటిలాగే నవ్వింది మీనాక్షి. ‘నిజం’ అన్నాడు ఆ వివాహితుడు. ఆ  స్నేహాన్ని స్వీకరించింది మీనాక్షి. ఏ కాస్త వెసులుబాటు దొరికినా కుమార్‌ సానుతో గడపడానికి ఆసక్తి చూపించసాగింది ఆమె. అతనూ అంతే మీనాక్షి ఏ కొంచెం టైమ్‌ ఇచ్చినా రెక్కలు కట్టుకొని చెప్పిన చోటికి వాలిపోయేందుకు సిద్ధమయ్యాడు. పెరిగిన చనువుతో ఆమెకూ కుమార్‌ అంటే ఇష్టం ఏర్పడింది. డేటింగ్‌ మొదలైంది.

ఆ సమయంలోనే మీనాక్షి నటించిన ఘాయల్‌ (హీరో సన్నీ డియోల్‌ )సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. సన్నీ డియోల్, మీనాక్షి జంటతోనే ఇంకో సినిమా ప్లాన్‌ చేశాడు ఘాయల్‌ దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి. అదే దామిని (1993). అదీ  బంపర్‌ హిట్‌. సన్నీ, మీనాక్షి, రాజ్‌కుమార్‌ సంతోషి త్రయానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. మీనాక్షి పట్ల రాజ్‌కుమార్‌ సంతోషీకీ ప్రేమ మొదలైంది. ఇటు .. కుమార్‌ సాను, మీనాక్షి తమ ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. అలా మూడేళ్లు గడిచాయి. రాజ్‌కుమార్‌కు మీనాక్షి పట్ల ఆరాధన అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకరోజు ధైర్యం చేసి మీనాక్షి వాళ్లింటికి వెళ్లి ‘నువ్వంటే ఇష్టం.. నీకూ ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాను’ అని తన మనసులో మాట ఆమెకు వినిపించాడు. సున్నితంగా తిరస్కరించింది మీనాక్షి. కుంగిపోయాడు అతను. డిప్రెషన్‌లోకీ వెళ్లాడు.

మరోవైపు.. తమ ప్రేమను ఎంత గుట్టుగా దాచినా ఆ పొగ ఇండస్ట్రీ మిత్రుల ద్వారా కుమార్‌ సాను భార్య రీటా భట్టాచార్యకు చేరింది. ఆమెలో అనుమానం మొదలైంది. ఈ లోపే మీడియా కుమార్‌ సాను సెక్రటరీని ఇంటర్వ్యూ చేసింది. అందులో ఆమె ‘కుమార్‌కి చాలామంది గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఇప్పుడు మాత్రం మీనాక్షితో డేటింగ్‌ చేస్తున్నాడు’ అని చెప్పింది. ఆ రాతప్రతి రీటా కంట్లోనూ పడింది. కుమార్‌ సానును నిలదీసింది. అదంతా రూమర్‌ అని కొట్టిపారేశాడు. దాంతో రీటా సమాధానపడలేదు.

పదేపదే ప్రశ్నించించడంతో నిజమే అని ఒప్పుకోక తప్పలేదు కుమార్‌ సానుకు. విడాకుల దావా వేసింది రీటా. ‘భర్త తన సంపాదనంతా మీనాక్షి కోసమే ఖర్చుచేస్తున్నాడు’ అనే అపవాదునూ జతపర్చింది. ఈ సీన్‌కి మనస్తాపం చెందింది మీనాక్షి. అంతేకాదు నెంబర్‌ వన్‌గా, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా సాగుతున్న తన కెరీర్‌ను, ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉందనీ భావించింది. పైగా కుమార్‌ సాను నుంచీ తనకు అనుకూలంగా ఎలాంటి స్పందన రాలేదు. విడాకుల వ్యవహారంతో కుమార్‌ సాను కూడా అభాసుపాలయ్యాడు. విడాకులు మంజూరయ్యాయి. మీనాక్షితో రిలేషన్‌ కూడా బ్రేక్‌ అయింది.  
న కోయీ హై, నా కోయీ థా.. జిందగీ మే తుమ్హారే సివా.. 
తుమ్‌ దేనా సాథ్‌ మేరా.. ఓ హమ్‌నవా.. (నాకప్పుడూ ఎవరూ లేరు.. ఇప్పుడూ లేరు.. నువ్వు నాకు తోడు ఉండవా నేస్తమా)  అనే పంక్తులు మిగిలాయి కుమార్‌ సానుకు పాడుకోవడానికి. 
అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ రీటా, కుమార్‌ సాను ఒక్కటయ్యారు. 

ఘాతక్‌.. 
డిప్రెషన్‌ నుంచి బయటపడ్డా మీనాక్షి మీద ప్రేమను చంపుకోలేకపోయాడు రాజ్‌కుమార్‌ సంతోషి. మళ్లీ ఆమెతో కలసి పనిచేయాలని నిశ్చయించుకున్నాడు. ఆమెను అడిగాడు. ఒప్పుకుంది. ’ఘాతక్‌’ సినిమా వచ్చింది. ఆ తర్వాత మీనాక్షి శేషాద్రి అమెరికాలో స్థిరపడ్డ హరీష్‌ మైసూర్‌ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ను పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భారతీయ శాస్త్రీయ నృత్యశాలను నిర్వహిస్తోంది. రాజ్‌కుమార్‌ సంతోషి కూడా మిలన్‌ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 
అలా ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఏ ఇద్దరి ప్రేమకూ శుభం కార్డ్‌ వేయలేదు.
- ఎస్సార్‌

మరిన్ని వార్తలు