గుర్తుకొస్తున్నాయి.. ఆనాటి మధుర జ్ఞాపకాలు

4 Feb, 2023 11:33 IST|Sakshi
కురబలకోట రైల్వేస్టేషన్‌లో సీతామాలక్ష్మి సినిమా సన్నివేశం (ఫైల్‌)

కడప:అపురూప చిత్రాల దర్శకులు, సృజన శీలి కె.విశ్వనాథ్‌కు అన్నమయ్య జిల్లా కురబలకోటతో మరుపురాని అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో సీతామాలక్ష్మి సినిమా తీశారు. మండలంలో తొలి సినీ షూటింగ్‌ కూడా ఇదే. నెల పాటు షూటింగ్‌ నిర్వహించారు. చంద్రమోహన్, తాళ్లూరి రామేశ్వరి హీరోహీరోయిన్లుగా నటించారు. సినీ షూటింగ్‌ ఎలా ఉంటుందో చూడటానికి జనం తరలి వచ్చారు. ఆ తర్వాత ఎన్నో ఈ చిత్రాలకు ఆద్యమైంది. 1978 జూలై 27న రిలీజ్‌ అయ్యింది. సూపర్‌ హిట్‌. చిన్న సినిమాగా రిలీజై పెద్ద పేరు తెచ్చుకుంది. 

మండలంలోని తెట్టు, కురబలకోట రైల్వేస్టేషన్‌లో పలు సన్నివేశాలు తీశారు. ఈ సినిమా ఆయన కేరీర్‌కు నిచ్చెనలా మారింది. మరో వైపు హీరోగా చంద్రమోహన్‌ కేరీర్‌కు కూడా దోహదపడింది. తాళ్లూరి రామేశ్వరికి  హీరోయిన్‌గా తొలి చిత్రమిది. ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ సినిమాను తమిళం, హిందీలో తీశారు. ఇప్పటికీ కురబలకోట రైల్వే స్టేషన్‌ను సీతామాలక్ష్మి స్టేషన్‌గా పిలుస్తుంటారు. కె.విశ్వనా«థ్‌ మృతితో మండల వాసులు సీతామాలక్ష్మి సినిమా షూటింగ్‌ నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు.   

మదనపల్లె అంటే విశ్వనాథుడికి ఎంతో ఇష్టం 
మదనపల్లె సిటీ : కళాతపస్వి, సినీ దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్‌కు మదనపల్లె అంటే ఎంతో ఇష్టం. ఆయన తన సన్నిహితులతో తరచూ చెప్పేవారు. భరతముని ఆర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపకులు రొమ్మాల మునికృష్ణారెడ్డికి విశ్వనాథ్‌తో సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలో 1990 ఏప్రిల్‌ 1న మదనపల్లెకు ఓ పాఠశాల వార్షికోత్సవానికి వచ్చారు. సిరిమువ్వల సింహనాదం సినిమా కథనాయకులు కళాకృష్ణ, మా«ధవిలతో కలిసి విచ్చేశారు. 

పిల్లలకు సామాజిక విలువల గురించి తెలియజేశారు. రెండు రోజుల పాటు మదనపల్లెలోనే బస చేశారు. విశ్వనాథ్‌తో తనకున్న పరిచయం గురించి చైతన్యభారతి పాఠశాల కరస్పాండెంట్‌ సంపత్‌కుమార్‌ తెలియజేశారు. పలు సార్లు విశ్వనాథ్‌ను కలిసినట్లు తెలిపారు. ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సీతామలక్ష్మి సినిమా చిత్రీకరణ కోసం దర్శకులు విశ్వనాథ్‌ కురబలకోట మండలం తెట్టు గ్రామానికి వచ్చినట్లు మదనపల్లెకు చెందిన జ్ఞానోదయ పాఠశాల కరస్పాండెంట్‌ కామకోటి ప్రసాదరావు తెలిపారు. తమ ఇంటిలోనే బస చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు.   

మరిన్ని వార్తలు