Suthi Velu: ఆ పాత్రలు చూసినా, డైలాగులు విన్నా కన్నీళ్లాగవు

27 Jun, 2021 09:08 IST|Sakshi

జంధ్యాల గుర్తించిన హాస్య గుళిక వేలు... శ్రీవారికి ప్రేమలేఖలో ప్రేమగీతానికి కథానాయకుడిలా నటించారు.. నాలుగు స్తంభాలాటలో వీరభద్రరావుతో కలిసి సుత్తి జంటలో భాగమయ్యారు.. కలికాలం చిత్రంలో కంటనీరు పెట్టించారు. ఒక కంట హాస్యం, ఒక కంట కరుణ కురిపించారు. కురుమద్దాలి లక్ష్మీనరసింహారావు సుత్తి వేలుగా మారిపోయారు.. ఆయనలోని ప్రత్యేకత, ఆయనతో పెనవేసుకున్న బంధం గురించి సుత్తి వేలు కుమార్తె సత్యవాణి మాటలలో...

భోగిరెడ్డిపల్లిలో శేషసత్యనారాయణ శర్మ, భాస్కరమ్మ దంపతులకు నాన్న మూడో సంతానంగా పుట్టారు. నాన్నకి అక్క, అన్న, చెల్లి ఉన్నారు. తాతగారు స్కూల్‌ టీచర్‌. క్రమశిక్షణకు మారు పేరు. నాన్న నాటకాలు వేస్తున్నందుకు కేకలేస్తుంటే, బామ్మ వెనకేసుకొచ్చేదట. తాతగారు దానధర్మాలతో ఆస్తంతా పోగొట్టుకున్నారట. అందువల్ల నాన్న జీవన పోరాటం చేస్తూ, డిగ్రీ పూర్తిచేశారు.

లక్ష్మీరాజ్యంతో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. నాన్నగారికి మేం నలుగురం పిల్లలం. భువనేశ్వరి, శ్రీదేవి, అన్నయ్య జగన్నాథ ఫణికుమార్, నేను. రెండో అక్క పుట్టిన తరవాత ‘ముద్ద మందారం’తో సినీ రంగ ప్రవేశం చేశారు. నాలుగు స్తంభాలాట నుంచి బిజీ అయిపోయారు. మేం నిద్ర లేచేసరికి షూటింగ్‌ స్పాట్‌లో ఉండేవారు. అందువల్ల మా విషయాలన్నీ అమ్మే చూసుకుంది.

వంట చేసేవారు
నాన్న షూటింగ్‌కి వెళ్లేటప్పుడు అమ్మ క్యారేజీ ఇచ్చేది. అది కనీసం పది మందికి సరిపోయేది. నాన్న శాకాహారి. పరిమితంగా తినేవారు. నాన్న కోసం పొడులు, రోటి పచ్చళ్లు అమ్మే స్వయంగా చేసేది. పెరుగంటే నాన్నకు చాలా ఇష్టం. పెళ్లయిన కొత్తల్లో విశాఖపట్టణంలో పని చేసేటప్పుడు నాన్నే వంటంతా చేసి పెట్టి వెళ్లిపోయేవారట. అప్పటికి అమ్మకి వంట రాదట. అంతేకాదు మా చిన్నప్పుడు ముద్ద పప్పులో పచ్చడి నంచి మాకు ముద్దలు పెట్టేవారు. నాన్న చేతిలో ఏం మహత్యం ఉందో కానీ, ఆ ముద్ద చాలా కమ్మగా అనిపించేది. మొదటి ముద్ద తాతగారికి పెట్టేవారు.

నాన్నే గెలిచేవారు
పొద్దున్నే పూజ చేసుకునేవారు. సినిమాలలో ఎంత హాస్యంగా కనిపిస్తారో, ఇంట్లో అంత మౌనంగా ఉండేవారు. మాకు జలుబు చేస్తే, అమ్మకి తిట్లు పడేవి. అమ్మతో చెస్‌ ఆడేవారు. ఎక్కువసార్లు నాన్నే గెలిచేవారు. మాకు ఇంటర్నేషనల్‌ క్యారమ్‌ మీద ఎలా ఆడాలో కిటుకులు చెప్పేవారు. మాకు... కలర్‌ పెన్సిల్స్, కార్లు, వాకింగ్‌ డాల్, బార్బీ సెట్, సోఫా సెట్, కాఫీ సెట్‌ తెచ్చారు. డిస్నీ క్యారెక్టర్సన్నీ తెచ్చారు. ఒకసారి బంగారం ఉంగరాలు తీసుకువచ్చారు. నాన్న బట్టలు అమ్మ సెలక్ట్‌ చేసేది.

అవి వేసుకున్నప్పుడు, అందరూ బాగున్నాయంటే, ‘మా ఆవిడ సెలక్షన్‌’ అనేవారు. ఇంటి దగ్గర తెల్ల పంచెను లుంగీగా కట్టుకునేవారు. టీ షర్ట్స్, షార్ట్స్‌ వేసుకునేవారు. నాన్న మిడిల్‌క్లాస్‌ ఫాదర్‌లా నార్మల్‌గా ఉండేవారు. ఇంట్లో తనకు కావలసిన వస్తువు కనిపించకపోతే మాత్రం, ‘ఆయ్‌’ అనేవారే కానీ, ఎన్నడూ కొట్టలేదు, తిట్టలేదు. నాన్న ఏది చేసినా మా మంచికే అనుకునేవాళ్లం. నేను ఇంజనిరీంగ్‌ చదవాలనుకుంటే చదివించారు. తనకు నచ్చినది చదవమని ఎన్నడూ బలవంత పెట్టలేదు.

ఏడ్చేశాం...
ఉష్‌.. గప్‌చుప్‌ చిత్రంలో, ‘నేను షుగర్‌ తినటం కోసమే ఇటువంటి పెళ్లిచూపులు ఏర్పాటు చేశాను’ అంటున్న డైలాగ్‌కి నా కళ్లు వర్షిస్తాయి. ‘కలికాలం’లో నాన్న పాత్ర తలచుకుంటేనే ఏడుపు ఆగదు. ‘ప్రతిఘటన’ సినిమా ఇప్పటికీ చూడలేకపోతాను. ఆ చిత్రానికి నాన్న నంది అవార్డు అందుకున్నారు. అప్పుడప్పుడు ప్రివ్యూలకు తీసుకువెళ్లేవారు. అక్కడ నుంచి వచ్చాక, ‘సినిమా ఎలా ఉంది’ అని అడిగేవారు. ‘కష్టాలు పడే పాత్రలు చెయ్యొద్దు నాన్నా, కామెడీ సినిమాలే చెయ్యి’ అనేవాళ్లం.

నాన్న నటనను బాలు మెచ్చుకునేవారట. ‘ప్రేమ ఎంత మధురం’ సినిమాలో నాన్న నటించిన సైంటిస్ట్‌ సన్నివేశాలను అన్నయ్య ఇమిటేట్‌ చేస్తుంటే, నాన్న సరదా పడేవారు. మమ్మల్ని, ‘మీరు వేలు గారి పిల్లలు కదా’ అని ఎవరైనా అడిగితే, నాన్నకి సుత్తి వేలు అనే పేరు ఉండటం వల్లే కదా ఇంత గుర్తింపు వచ్చిందని గర్వంగా అనిపించేది. ఒక సీరియల్‌లో నటిస్తున్న సమయంలో నాన్నకు తెలియకుండానే ముక్కుపొడుం పీల్చే అలవాటు వచ్చేసింది.

నాన్న నేర్పించారు..
అమ్మ తీర్థయాత్రలకి వెళ్లినప్పుడు నాన్నే స్వయంగా వంట నేర్పించారు. నాన్న డైరెక్షన్‌లో ఉప్మా తయారుచేశాను. నా పెళ్లయ్యి అప్పగింతల సమయంలో కళ్లనీళ్లు పెట్టుకున్న నాన్న, ఆ తరవాత మా ఇంటికి వచ్చినప్పుడు దగ్గరుండి నాతో వంట చేయించారు. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఒకసారి నన్ను చూడటానికి చెన్నై వచ్చారు. నాన్నకు వాకింగ్, వ్యాయామం అలవాటు. ఆ రోజు కూడా అలాగే వెళ్లి వచ్చారు. ఏమైందో తెలీదు. మూడు గంటల సమయంలో, నాన్న తల ఒక వైపు వాలిపోయినట్లు గమనించి, ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి పల్స్‌ అందట్లేదన్నారు. జోకులు వేస్తూ, మంచి గైడెన్స్‌ ఇస్తూ, ఎన్నో మంచి విషయాలు చెప్పే నాన్న ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయాం. ‘మన దగ్గరకు వచ్చి అడిగినవారికి సహాయం చేయాలి’ అని నాన్న చెప్పిన మాటను అనునిత్యం స్మరించుకుంటాం. 
ఆ తండ్రి కడుపున పుట్టినందుకు ఎప్పుడూ గర్వపడతాం.
- సంభాషణ: వైజయంతి పురాణపండ

చదవండి: ఈ ఫొటోలో హన్సిక డ్రెస్‌, కమ్మల ధర ఎంతో తెలుసా?

మరిన్ని వార్తలు