లగాన్‌ వర్సెస్‌ గదర్‌: రెండూ గొప్ప సినిమాలే!

16 Jun, 2021 09:25 IST|Sakshi

లగాన్‌ వర్సెస్‌ గదర్‌

భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రం ‘లగాన్‌: వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ ఇండియా’. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్‌ అవార్డుకి నామినేషన్‌ ఎంట్రీకి వెళ్లడంతో పాటు ఎనిమిది జాతీయ అవార్డులు సాధించిన చిత్రం ‘లగాన్‌’. ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటించడమే కాదు.. నిర్మాతగా మారి, నిర్మించిన తొలి చిత్రం ఇది. అశుతోష్‌ గోవారీకర్‌ దర్శ కత్వం వహించిన ఈ చిత్రం విడుదలై జూన్‌ 15కి 20 ఏళ్లయింది. ఈ చిత్రంతో పాటు సన్నీ డియోల్‌ నటించిన ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’ కూడా విడుదలై 20 ఏళ్లయింది. ఈ చిత్రాన్ని అనిల్‌ శర్మ డైరెక్ట్‌ చేశారు. రెండు సినిమాలు ఒకే  రోజున విడుదలైనప్పుడు పోలికలు సహజం. ఎక్కువ తక్కువలు ఉండటమూ సహజమే. ‘గదర్‌’కి జాతీయ అవార్డులు రాకపోయినా మంచి సినిమా అనిపించుకుని, మంచి విజయాన్ని అందుకుంది.

ఇక 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘లగాన్‌’ 20 ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొనవలసిందిగా చిత్రబృందం ఇచ్చిన పిలుపుకు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు. ‘మై లగాన్‌ స్టోరీ’ అంటూ ‘లగాన్‌’ సినిమా గురించిన తమ అభిప్రాయాలను, అనుభూతులను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మరోవైపు ‘‘లగాన్‌’ చిత్రం విడుదలైన రోజునే (జూన్‌ 15, 2001) ‘గదర్‌’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గదర్‌’ కూడా మంచి సినిమాయే. వసూళ్ల పరంగా కూడా మంచి విజయం సాధించింది. కేవలం ‘లగాన్‌’ సినిమా గురించే ప్రస్తావించడం సరైంది కాదు. ‘గదర్‌’ సినిమాను కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నట్లుగా కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలా ఇరవై ఏళ్ళ క్రితం ‘లగాన్‌’, ‘గదర్‌’ సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీపడితే తాజాగా ఈ రెండు సినిమాల అభిమానులు సోషల్‌ మీడియాలో ‘లగాన్‌ వర్సెస్‌ గదర్‌’ అనే విధంగా కామెంట్లు విసురుకోవడం విశేషం. ఆ సంగతలా ఉంచితే...

‘లగాన్‌’ చిత్రబృందం రీ యూనియన్‌కు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రంగం సిద్ధం చేస్తోంది. ‘ఛలే ఛలో లగాన్‌: వన్స్‌ అపాన్‌ యాన్‌ ఇంపాజిబుల్‌ డ్రీమ్‌’ అనే టైటిల్‌తో జరగనున్న ఈ రీ యూనియన్‌ స్పెషల్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా యూట్యూబ్‌ చానెల్‌లో ప్రసారం కానుంది. ‘లగాన్‌’ గురించి ఆమిర్‌ ఖాన్‌ తాజాగా మాట్లాడుతూ..‘‘ఈ చిత్రప్రయాణంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ‘లగాన్‌’ నాకు అద్భుతమైన జర్నీ. నా జీవితానికి కొత్త స్నేహితులను, బంధాలను ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాతో పాటు ఈ బంధాలు కూడా ఇరవై ఏళ్ళ నుంచి నా జీవితంలో కొనసాగుతూనే ఉన్నాయి. ‘లగాన్‌’ గ్యాంగ్‌ని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.

‘‘ప్రజలందరూ కలిసి కష్టాలపై సమష్టిగా పోరాడే తత్వమే ‘లగాన్‌’ చిత్రానికి ప్రేరణ’’ అన్నారు దర్శకులు అశుతోష్‌. ‘‘ఇండియన్‌ సినిమా చరిత్రలో ‘లగాన్‌’ ఒక ఐకానిక్‌ మూవీ. భారతీయ కథలను విశ్వ వేదికపై నిలిపిన చిత్రం ఇది. ‘లగాన్‌’ 20 ఏళ్ళ సెలబ్రేషన్స్‌ చేస్తున్నందుకు గౌరవంగా ఫీల్‌ అవుతున్నాం’’ అన్నారు నెట్‌ఫ్లిక్స్‌ ప్రతినిధి షెర్గిల్‌. ‘గదర్‌’ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘‘మేం ఒక సినిమా చేశాం. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్స్‌లో ఓ వేడుకలా చూశారు. ఈ హిస్టారిక్‌ ఫిల్మ్‌తో అసోసియేట్‌ ఉన్న అందరికీ ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేశారు సన్నీ డియోల్‌.

చదవండి: ఒంటినిండా బురదతో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు