లక్కీ ఛాన్స్‌ కొట్టేసిన లక్ష్మీ మీనన్‌

10 Jul, 2022 13:17 IST|Sakshi

అదృష్టం ఎప్పుడు ఎవరికి ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. హీరోయిన్‌ లక్ష్మీమీనన్‌కు అలాంటి అదృష్టమే పట్టిందనే టాక్‌ కోలీవుడ్‌లో వైరల్‌ అవుతోంది. కుంకీ చిత్రంతో హీరోయిన్‌గా కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ మలయాళ గుమ్మ ఆ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా విశాల్, కార్తీ, విమల్‌ వంటి నటులతో జత కట్టి విజయాలను అందుకుంది. మంచి ఫామ్‌లో ఉండగా పదో తరగతి పరీక్షలు రాయాలంటూ సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది.

అది కాస్తా లాంగ్‌ గ్యాప్‌ అయ్యింది. ఆ తరువాత ఒకటి, అర చిత్రాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో లక్ష్మీమీనన్‌ పేరు కోలీవుడ్‌లో దాదాపు మరుగున పడిపోయింది. అలాంటిది ఇప్పుడు సడన్‌ వార్తల్లో నానుతోంది. చంద్రముఖి–2 చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందనే ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన చంద్రముఖి చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దర్శకుడు పూరి వాసు తెరకెక్కిస్తున్నారు. లారెన్స్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నటి రాశీఖన్నాను నాయకిగా ఎంపిక చేసినట్లు మొదట ప్రచారం జరిగింది. ఆ తరువాత త్రిషను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్‌ వైరల్‌ అయ్యింది. తాజాగా ఆ లక్కీఛాన్స్‌ నటి లక్ష్మీమీనన్‌ను వరించినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు