లాల్ స‌లామ్ స‌క్సెస్ పార్టీకి హీరోలు డుమ్మా! ర‌జ‌నీకాంత్ మాత్రం..

25 Feb, 2024 11:46 IST|Sakshi

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ అతిథిగా పవర్‌ ఫుల్‌ పాత్రను పోషించిన చిత్రం లాల్‌ సలామ్‌. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించారు. నటి నిరోషా, జీవిత రాజశేఖర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించ‌గా, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన లాల్‌ సలామ్‌ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది.

ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం అంతంత‌మాత్రంగానే వసూళ్లు రాబ‌డుతోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ వ‌రుస‌గా మూడవ వారంలోకి అడుగు పెట్టడంతో చిత్ర యూనిట్‌ శుక్రవారం చైన్నెలో సక్సెస్‌ పార్టీని జ‌రుపుకుంది. ఈ పార్టీలో రజనీకాంత్‌తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ పాల్గొనడం విశేషం.

హీరోలు విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ఇందులో పాల్గొనలేదు. కాగా లాల్‌ సలామ్‌ చిత్రం సక్సెస్‌ పార్టీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయ‌గా నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు. క‌లెక్ష‌న్సే లేని సినిమాకు స‌క్సెస్ పార్టీయా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.

చ‌ద‌వండి: నాన్న వల్లే నా జీవితం నాశనం అయింది: వనితా విజయ్‌ కుమార్‌

whatsapp channel

మరిన్ని వార్తలు