Hollywood To Bollywood Remakes: బాలీవుడ్‌ సేఫ్‌ గేమ్‌.. రీమేక్‌తో పబ్బం గడుపుతుంది!

15 Apr, 2022 08:07 IST|Sakshi

హిట్టయిన కథతో సినిమా తీస్తే...దాదాపు హిట్‌ ఖాయం.దీన్నే ‘సేఫ్‌ గేమ్‌’ అంటారు.ఇప్పుడు బాలీవుడ్‌ ఈ గేమ్‌ ఆడుతోంది.ఇప్పటికే దక్షిణాదిలో హిట్టయిన పలు చిత్రాలు అక్కడ రీమేక్‌ అవుతున్నాయి.మరోవైపు దాదాపు అరడజను హాలీవుడ్‌ సినిమాల ఆధారంగా హిందీ సినిమాలు రూపొందుతున్నాయి.హిందీలో రీమేక్‌ అవుతున్న ఆ హాలీవుడ్‌ చిత్రాల గురించి తెలుసుకుందాం.

లాల్‌ కథ
లాల్‌సింగ్‌ అమాయకుడు... చిన్నపాటి శారీరక లోపం కూడా ఉంటుంది. అమాయకుడు కదా అని కొందరు హేళన చేస్తుంటారు. అయితే తన పుట్టుకకు ఒక కారణం ఉందనుకుంటాడు లాల్‌. ఆర్మీలో చేరతాడు. తన చిన్ననాటి ప్రేయసిని కలవాలన్నది అతని లక్ష్యం. చివరికి కలుసుకోగలిగాడా? లాల్‌ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రకథ. 1994లో విడుదలైన ఈ హాలీవుడ్‌ కామెడీ డ్రామా ‘లాల్‌సింగ్‌ చద్దా’గా హిందీలో రీమేక్‌ అయింది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌లో ఆమిర్‌ ఖాన్, హీరోయిన్‌గా కరీనా కపూర్, కీలక పాత్రలో నాగచైతన్య నటించారు. కోవిడ్‌ కారణంగా పలు మార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్ట్‌ 11న విడుదల కానుంది. 

మరో రీమేక్‌లోనూ..
ఇంకో విషయం ఏంటంటే... ‘ఫారెస్ట్‌ గంప్‌’ రీమేక్‌లో నటించిన ఆమిర్‌ ఖాన్‌ మరో హాలీవుడ్‌ సినిమా ‘కాంపియన్స్‌’ రీమేక్‌లో నటించడానికి సన్నాహాలు మొదలుపెట్టారని టాక్‌. 2018లో ‘కాంపియన్స్‌’ విడుదలైంది. మానసిక లోపాలున్న బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుల జట్టుకు కోచింగ్‌ ఇచ్చి, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించేలా చేసిన కోచ్‌ జీవితకథే ఈ సినిమా. కోచ్‌గా ఆమిర్‌ చేయనున్నారు.

ఓ ప్రత్యేకమైన అనుబంధం
అతని వయసు 70. భార్య చనిపోతుంది. ఎంతో చురుకుగా ఉండే అతనికి రిటైర్‌మెంట్‌ జీవితం నచ్చదు. ఓ ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ వెబ్‌సైట్‌లో సీనియర్‌ ఇంటర్న్‌గా జాబ్‌ సంపాదిస్తాడు. పని రాక్షసి అయిన సీఈవో అంటే ఎవరికీ నచ్చదు. అయితే తన ప్రతిభ, తీరు కారణంగా సహోద్యోగులకు దగ్గర కావడంతో పాటు లేడీ బాస్‌ని కూడా ఆకట్టుకుంటాడు. ఆ ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ‘ది ఇంటర్న్‌’ కథ. 2015లో విడుదలైన ఈ చిత్రం హిందీ రీమేక్‌ రిషీ కపూర్, దీపికా పదుకోన్‌ కాంబినేషన్‌లో రూపొందాల్సింది. అయితే రిషీ కపూర్‌ మరణించడంతో ఆయన పాత్రకు అమితాబ్‌ బచ్చన్‌ని తీసుకున్నారు. కోవిడ్‌ లాక్‌డౌన్ల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ కామెడీ డ్రామా మూవీ షూటింగ్‌ను త్వరలో ఆరంభించాలనుకుంటున్నారు.

సోదరి కోసం..
సోదరిని హత్య చేసిందెవరో తెలుసుకోవడానికి ఓ అమ్మాయి చేసే ప్రయత్నమే ‘జూలియాస్‌ ఐస్‌’. 2010లో ఈ హారర్‌ థ్రిల్లర్‌ విడుదలైంది. హిందీలో ఈ చిత్రం ‘బ్లర్‌’ టైటిల్‌తో రీమేక్‌ అయింది. కంటిచూపు మందగిస్తున్నప్పటికీ సోదరిని హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నం చేసే యువతి పాత్రను తాప్సీ చేశారు. ఈ సినిమా కథ నచ్చి ఆమె ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అజయ్‌ బెహల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. 

చూపు లేకపోయినా....
ఒక కారు ప్రమాదంలో ఓ యువతి చూపు కోల్పోతుంది. అయితే ఓ ఇన్వెస్టిగేషన్‌ విషయంలో పోలీసులకు సహాయపడుతుంది. హాలీవుడ్‌ మూవీ ‘బ్లైండ్‌’ (2016) కథ ఇది. ఇదే టైటిల్‌తో సోనమ్‌ కపూర్‌ నాయికగా హిందీలో రీమేక్‌ అయింది. షోమే మఖీజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కోవిడ్‌ వల్ల  వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్‌  చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లలో లేదా  ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

ఓ సైనికుడి కథ
జాన్‌ రాంబో మాజీ సైనికుడు. వియత్నాం యుద్ధం తాలూకు జ్ఞాపకాలతో జీవితం గడుపుతుంటాడు. అయితే ఒక చిన్న పట్టణంలో ఒక వ్యక్తితో జరిగిన ఘటన వల్ల రాంబో ఇబ్బందులు ఎదుర్కొంటాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే కథతో సాగే చిత్రం ‘రాంబో: ఫస్ట్‌ బ్లడ్‌’ (1982). సిల్వెస్టర్‌ స్టాలోన్‌ నటించిన ఈ యాక్షన్‌ మూవీ హిందీలో టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా రీమేక్‌ కానుంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు. ఇవే కాదు... ‘బిగిన్‌ ఎగైన్‌’, ‘రెడ్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలు కూడా హిందీలో రీమేక్‌ కానున్నాయి. కథ యూనివర్శల్‌ అయితే ప్రాంతం, భాషతో సంబంధం లేదు. అందులోని పాయింట్‌ ఎవరికైనా కనెక్ట్‌ అవుతుంది. అందుకే ఈ విదేశీ చిత్రాలు దేశీ తెరమీదకు వస్తున్నాయి.  

మరిన్ని వార్తలు