Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ ఆలపించిన తెలుగు పాటలు.. అవేంటంటే ?

6 Feb, 2022 11:11 IST|Sakshi

Lata Mangeshkar Death: See Her Top 3 All Time Best Telugu Songs: లెజండరీ గాయనీ లతా మంగేష్కర్‌ ఇక లేరు. కరోనాతో పోరాడుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్‌ కొన్ని వారాల  క్రితం స్వల‍్ప కొవిడ్‌ లక్షణాలతో ముంబైలోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన దక్కించుకోలేకపోయాం. సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన లతా మంగేష్కర్‌ 20 భారతీయ భాషల్లో 980 చిత్రాలకు గాను సుమారు 50 వేలకుపైగా పాటలకు గానం అందించారు. అయితే వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. తెలుగులో కేవలం మూడంటే మూడు పాటలే పాడారు లతా మంగేష్కర్‌. తెలుగులో ఆమె ఎక్కువగా పాటలు పాడకపోవడానికి కారణం మాత్రం తెలియదు. 

ఇండియన్‌ నైటింగల్‌ పాడిన తెలుగు పాటల్లో ఒకటి 1955లో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నటించిన 'సంతానం' చిత‍్రంలోనిది. సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అందించిన 'నిదురపోరా తమ్ముడా' పాట లతా మంగేష్కర్‌ పాడిన తొలి తెలుగు పాట. తర్వాత 1965లో సీనియర్ నందమూరి తారక రామారావు, జమున జంటగా నటించిన 'దొరికితే దొంగలు' సినిమాలోది. ఇందులో 'శ్రీ వెంకటేశా' అనే గీతాన్ని ఆలపించారు లతా మంగేష్కర్‌. ఈ పాటను సాలూరి రాజేశ్వర రావు కంపోజ్‌ చేశారు.

ఇక తెలుగులో లతా మంగేష్కర్‌ పాడిన మూడో పాట చివరి పాట 'తెల్ల చీరకు' అనే సాంగ్‌. ఈ పాట కింగ్‌ నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన 'ఆఖరి పోరాటం' చిత్రంలోనిది. 1988లో వచ్చిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించగా, దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు లతా మంగేష్కర్‌.

మరిన్ని వార్తలు