అలనాటి నటుడు హరనాథ్‌ కూతురు, నిర్మాత భార్య పద్మజా రాజు హఠాన్మరణం

20 Dec, 2022 17:01 IST|Sakshi

ప్రముఖ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటి తరం అందాల హీరో హరనాథ్‌ కూతురే పద్మజా రాజు.  ఆమె సోదరుడు శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే. పద్మజా రాజు భర్త జి.వి.జి.రాజు, పవన్ కళ్యాణ్ హీరోగా ‘‘గోకులంలో సీత, తొలిప్రేమ’’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ చిత్రం కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాలనటుడు’ పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు.

ఆ పుస్తకాన్ని నటశేఖర, దివంగత నటులు సూపర్‌స్టార్‌ కృష్ణ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పద్మజా రాజు ఇటీవల ఓ టీవీ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా త్వరలోనే తన కుమారుల్లో ఒకరు నిర్మాతగా పరిచయం కానున్నారనీ ఆమె తెలిపారు. వచ్చే ఏడాది తన కుమారుడిని నిర్మాతగా పరిచయం చేసే ప్రయత్నాల్లోనే పద్మజ, ఆమె భర్త జి.వి.జి.రాజు ఉండగానే ఆమె హఠాన్మరణం చెందడం విచారకరం. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ.. జీవీజీ రాజు, ఆయన కుమారులకు మనో ధైర్యం లభించాలని పలువురు సినీ ప్రముఖులు అభిలషించారు.

చదవండి: 
ఆసక్తిగా శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ లేటెస్ట్‌ పోస్ట్‌.. ‘దీని అంతర్యం ఏంటీ?’
సమంత షాకింగ్‌ నిర్ణయం! ఆ ప్రాజెక్ట్స్‌ నుంచి సామ్‌ అవుట్‌?

మరిన్ని వార్తలు