International Women's Day 2023: 'పోరాడి గెలిచారు.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు'

7 Mar, 2023 20:57 IST|Sakshi

ప్రస్తుత పోటీ ప్రపంచంలో సినీరంగంలో రాణించడమంటే మాటలు కాదు. పైగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం అంతా ఈజీ కాదు. ఎంత టాలెంట్ ఉన్న కూడా అదృష్టం కలిసి రాకపోతే ఈ రంగంలో గుర్తింపు దక్కడం కష్టమే. అంతే కాకుండా కెరీర్ సాఫీగా సాగుతుందనుకునేలోపే ఊహించని సంఘటనలు మరింత వెనక్కి లాక్కెళ్తాయి. అవకాశాలు అందే సమయంలో అనుకోని పరిణామాలతో దాదాపు కెరీర్ ముగిసేంతా పరిస్థితి ఎదురవుతుంది. కానీ అలాంటి సమయంలోనే మనం పట్టుదలగా ఉండాలి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకూడదు. అలా ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్న హీరోయిన్ల పేర్లు ఇట్టే వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. జీవితంలో అత్యంత గడ్డుకాలాన్ని అధిగమించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్లు కొందరే ఉన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా విజయం సాధించిన ఆ తారలపై ప్రత్యేక కథనం. 

మయోసైటిస్‌ను జయించిన సమంత

సమంత సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు. గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ ఆ తర్వాత కోలుకుని కెరీర్‌లో మళ్లీ బిజీ అయిపోయింది. మయోసైటిస్ బారిన పడిన సమయంలో అత్యంత క్లిష్ట పరిస్థితులను అనుభవించింది. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు సమంత. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధి సోకినా.. ధైర్యంగా నిలబడి ఎదుర్కొంది. ప్రస్తుతం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ను సెట్స్‌ మీదకు తీసుకొచ్చింది. ఆ తర్వాత విజయ్‌దేవరకొండ ‘ఖుషీ’ చిత్రంలోనూ సామ్‌ నటించనుంది.

గతంలో మయోసైటిస్ గురించి సామ్ మాట్లాడుతూ.. 'ఎదుటి వాళ్లు ఎంతగా కష్టపడుతున్నారు.. జీవితంలో ఎంత పోరాడుతున్నారు.. అనేది మీకు ఎప్పటికీ తెలియదు.. అందుకే కాస్త దయతో మెలగండి’అని సామ్‌  చెప్పుకొచ్చింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోందంటూ ఎమోషనలైంది సామ్. 

అందువల్లే బయటపడ్డా: సుస్మితాసేన్‌

ఇటీవల మాజీ మిస్‌వరల్డ్, నటి సుస్మితాసేన్‌ ఇటీవల తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆమెకు వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి, స్టంట్‌ వేశారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. ఇటీవలే ఓ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు సుస్మితాసేన్‌.

ఆమె మాట్లాడూతూ.. 'ఇటీవల నేను తీవ్ర గుండెపోటుకు గురయ్యా. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. వైద్యులు నా కోసం ఎంతో శ్రమించారు. నా కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇటీవల ఎక్కువగా గుండెపోటు కేసులు నమోదు కావడాన్ని గమనిస్తున్నాం. దయచేసి వ్యాయామాలు చేయండి. నా విషయంలో వ్యాయామాలు చేయడం ఉపయోగపడింది. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది. మా నాన్న సుబీర్‌సేన్‌ నాకు చెప్పిన ఈ మాటలే నాకు స్ఫూర్తి' అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా సేన్. 

ఆత్మవిశ్వాసంతో గెలిచా: హంసా నందిని

అత్తారింటికి దారేది, ఈగ, మిర్చి సినిమాల్లో తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి హంసానందిని. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఏడాదిన్నర పాటు క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. గతంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసానందిని ప్రస్తుతం సినిమాలతో బిజీ ‍అయిపోయింది. 

గతంలో హంసా మాట్లాడుతూ..' వైద్య పరీక్షల్లో నాకు వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్‌ ఉందని తేలింది. జన్యు పరివర్తన కారణంగా భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు చెప్పారు. అయినా కూడా నేను అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసంతోనే ఆ మహమ్మారిని గెలిచా.' అంటూ చెప్పుకొచ్చింది.

క్యాన్సర్‌తో పోరాడిన సోనాలిబింద్రే

‘మురారి’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’, ‘శంకర్‌దాదా ఎమ్‌బీబీఎస్‌’ వంటి పలు తెలుగు హిట్‌ చిత్రాల్లో నటించిన భామ సోనాలి బింద్రే. సోనాలిబింద్రే క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడి గెలిచింది. అమెరికాలో క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుని మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ కష్టం సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించింది. మనిషి తన జీవితం ఎన్నో పాఠాలు నేర్పిస్తుందని.. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది. 

రెండుసార్లు జయించిన మమతా మోహన్‌దాస్‌

రెండు సార్లు(2010, 2013) కేన్సర్‌ బారిన పడి నటి మమత మోహన్ దాస్. ధైర్యంగా,ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చికిత్స చేయించుకొని కోలుకుంది. ఇటీవలే మరో అరుదైన చర్మ వ్యాధి బారిన పడినట్లు వెల్లడించింది. ‘విటిలిగో(బొల్లి)’ వ్యాధి సోకిందని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

క్యాన్సర్‌ సమయంలో తాను పడిన కష్టాలను గతంలో ఆమె వివరించింది. క్యాన్సర్‌కు గురికావడంతో నా కలలన్నీ చెదిరిపోయాయని వెల్లడించింది. ఏడేళ్లు పోరాడి ఆ మహమ్మారిని జయించానని తెలిపింది. అమ్మానాన్నలు,స్నేహితుల ధైర్యంతోనే క్యాన్సర్‌పై గెలిచానని చెప్పుకొచ్చింది. అలాగే గతంలో సీనియర్‌ హీరోయిన్లు మనీషా కొయిరాల, గౌతమి కూడా క్యాన్సర్‌ను జయించిన వారిలో ఉన్నారు. 
 

మరిన్ని వార్తలు