ఈ వారం అలరించే సినిమాలు.. థియేటర్స్‌లో చిన్న చిత్రాలు, ఓటీటీలో బ్లాక్‌బస్టర్స్‌

21 Feb, 2023 12:14 IST|Sakshi

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా నడుస్తోంది. సంక్రాంతి పండగా కారణంగా జనవరిలో అన్ని పెద్ద చిత్రాలే విడుదలయ్యాయి. చిన్న సినిమాలకు థియేటర్స్‌ దొరకడం కష్టంగా మారింది. దీంతో ఫిబ్రవరి నెలలో వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. అయితే వాటిలో రైటర్‌ పద్మభూషన్‌.. సార్‌,  వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలు పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకోగా.. పెద్ద చిత్రాలుగా వచ్చిన అమిగోస్‌, మైఖేల్‌ లాంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. ఇక ఈ నెల చివరి వారంలో థియేటర్స్‌ సందడి చేసేందుకు చిన్న చిత్రాలు రెడీ అయితే.. ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పెద్ద చిత్రాలు రాబోతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలపై ఓ లుక్కేద్దాం. 

మిస్టర్‌ కింగ్‌
సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నటుడు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. దివంగత దర్శకురాలు విజయ నిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ హీరోగా శశిధ్‌ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’. యశ్విక నిష్కల, ఊర్వి సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

కోససీమ థగ్స్‌
ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బృందా తెరకెక్కించిన ఇంటెన్స్‌ యాక్షన్‌ తమిళ చిత్రం ‘థగ్స్‌’. హ్రిదు హరూన్‌ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సింహ, ఆర్‌కే సురేష్, మునిష్‌కాంత్, అనస్వర రంజన్‌ కీ రోల్స్‌ చేశారు.
హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై జీయో స్టూడియోస్‌ భాగస్వామ్యంతో రియా షిబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’పేరుతో  ఈ చిత్రం రిలీజ్‌ రాబోతుంది. 

డెడ్‌లైన్‌
అజయ్‌ ఘోష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డెడ్‌ లైన్‌. బొమ్మారెడ్డి.వి.ఆర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. 

ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతున్న పెద్ద చిత్రాలు

వారసుడు
తమిళస్టార్‌ విజయ్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ వారిసు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో వారసుడు పేరుతో విడుదలై భారీ విజయం సాధించింది. ది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. 

 వీరసింహారెడ్డి
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఫిబ్రవరి 23నుంచి ప్రముఖ ఓటీటీ హాట్‌ స్టార్‌లో వీరసింహారెడ్డి స్ట్రీమింగ్‌ కానుంది. 

మైఖేల్‌
సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం మైఖేల్‌. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 3న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో అనుకున్న సమయానికంటే ముందే ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేస్తుంది. ఫిబ్రవరి 24 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో  దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా నటించగా, విజయ్‌ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు.  

వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి మెగాస్టార్‌ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ నెల 27 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు