పాతికేళ్ల తరవాత రీ షూట్‌ అయిన పాట

18 Dec, 2020 12:06 IST|Sakshi

పాటతత్త్వం

చిత్రం: లిటిల్‌ సోల్జర్స్‌
రచన: సిరివెన్నెల
సంగీతం: శ్రీ
గానం: దీపిక, విష్ణుకాంత్‌

నా జీవితంలో ‘లిటిల్‌ సోల్జర్స్‌’ ఒక మైల్‌స్టోన్‌. ఆ సినిమా సమయానికి నాకు పదేళ్లు. నా చెల్లిగా వేసిన కావ్యకు నాలుగేళ్లు. కావ్య మరీ చిన్నపిల్ల కావటం వల్ల 40 రోజులు అనుకున్న షూటింగ్‌ వందరోజుల పాటు జరిగింది. దర్శకులు గుణ్ణం గంగరాజుగారు ఆయనకు కావలసిన విధంగా వచ్చేవరకు ఎన్ని టేక్‌లైనా ఓపికగా చేయించారు. ఈ సినిమాకు పిల్లలే హీరోలు. ఈ సినిమాలోని ‘అయామ్‌ వెరీ గుడ్‌ గర్ల్‌’ పాట నేటికీ చిగురాకులా పచ్చగా ఉంది. పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పాటను, ఇప్పుడు మా అమ్మాయికి అన్నం తినిపించటానికి చూపిస్తున్నాను. ఈ పాతికే ళ్లలో ఎంతోమంది వచ్చి, ‘నాకు మీలాంటి అన్నయ్య ఉన్నాడు, నాకు బన్నీలాంటి చెల్లాయి ఉంది’ అంటూ చెబుతూనే ఉన్నారు. ఈ సినిమా తరవాత నేను కావ్యను మళ్లీ చూడలేదు. కాని అప్పుడే బన్నీ నాకు చెల్లి అని ఫిక్స్‌ అయిపోయాను.

బన్నీ (కావ్య) పెళ్లికి వాళ్ల అన్నయ్య ఫోన్‌ చేసి, ‘మన చెల్లికి పెళ్లి జరుగుతోంది, నువ్వు రావాలి’ అని పిలిచాక, ఈ పాట రీషూట్‌ చేయబోతున్న విషయం చెప్పాడు. ఇందులో నేను స్నేహితుడిగాను, ఆదర్శ్‌ అన్నయ్యగాను చేద్దామన్నాడు. అలా ఆ పాటను 2015లో రీషూట్‌ చేశాం. ఇలా ఈ పాటతో పాతికేళ్లుగా అనుబంధం కొనసాగుతోంది. ఆ సినిమా షూటింగ్‌ అంతా మాకు సెలబ్రేషనే. గుణ్ణం గంగరాజుగారి వదిన ఊర్మిళ గారి అమ్మాయి కావ్య. అయినా ‘ఇద్దరూ మన పిల్లలే’ అనే భావనతోనే చూశారు. కావ్య షూటింగ్‌లో ఎవ్వరి మాటా వినేది కాదు. ఊర్మిళ పెద్దమ్మ లేదంటే నేను మా ఇద్దరి మాటే వినేది. కెమెరా పక్కనే నిలబడి ఫైవ్‌స్టార్, కోక్‌ చూపిస్తే చాలు వెంటనే చేసేసేది. ఆ పాటలోని ప్రతి చిన్న బిట్‌ను చాలా టేక్‌లు తీశారు. ‘టింగ్‌’ అనే చిన్న బిట్‌ కోసం కనీసం పాతికసార్లు చేశాం.

నాలుగేళ్ల కావ్య చేత చేయించిన ఘనత గంగరాజు, రసూల్‌ గార్లదే. ఒక్కోసారి నిద్రపోతుండేవాళ్లం. ఒకసారి బ్రేక్‌ చెప్పకుండా, ఎవ్వరికీ చెప్పకుండా అన్నం తినేశాను. అప్పుడు గంగరాజు గారు కేకలేసి, క్రమశిక్షణ నేర్చుకోవాలన్నారు. ఈ సినిమాలో మాకు తల్లిదండ్రులుగా నటించిన అరవింద్, హీరా గార్లు మాకు చాకొలేట్లే కాకుండా బహుమతులు కూడా తెచ్చిపెట్టారు. ఈ పాటను ఎప్పటికీ మరచిపోలేను.

 – సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు