ప్రేమ ఎంత మధురం..విధి ఎంత కఠినం!

31 Mar, 2021 10:23 IST|Sakshi

వెంకటేష్‌ ప్రభు కస్తూరిరాజా ఎవరు? అంటే ‘ఏమో’ అనేవాళ్లే ఎక్కువ. ‘అదేనండీ ధనుష్‌’ అంటే మాత్రం తెలియదనే వాళ్లు  తక్కువ. అది ఆయన స్క్రీన్‌నేమ్‌. పదాలు అల్లడం, పాటకు గొంతు సవరించడంతో పాటు పుస్తకాలు చదవడం అనేది కూడా ఆయన అభిరుచుల్లో ఒకటి. ధనుష్‌కు నచ్చిన పుస్తకాల్లో ఒకటి లవ్‌స్టోరీ.. ప్రేమికుల దినోత్సవం, 1970లో విడుదలైన ఈ నవల సంచలనం సృష్టించింది. అమెరికన్‌ రచయిత ఎరిక్‌ సెగల్‌ రాసిన ఈ రొమాన్స్‌ నవల ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌’ జాబితాలో అనేక వారాల పాటు అగ్రస్థానంలో నిలిచింది. ఎన్నో భాషలలోకి అనువాదం అయింది. సినిమాకు స్క్రీన్‌ప్లేగా రాసుకున్న ఈ కథను నవలగా రాశాడు సెగల్‌.

‘ఆమె అందంగా ఉంటుంది. తెలివైనది. పాతికేళ్ల వయసులోనే ఆమె చనిపోయింది...’ అంటూ నవల మొదలవుతుంది. విషాదాంత కథలకు నిర్దిష్టమైన కాలపరిధి అంటూ ఉండదు. అవి కాలతీతమైనవి అని చెప్పడానికి ఈ నవల మరో బలమైన ఉదాహరణ. స్థూలంగా చెప్పాలంటే ఇది పెద్దింటి అబ్బాయి, పేదింటి అమ్మాయి ప్రేమకథ.(ఒక అమెరికన్‌ ప్రముఖుడి యవ్వనపు రోజుల నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ నవల రాశాడు అనే గుసగుసలు కూడా ఉన్నాయి.

ఆలివర్, జెన్నిఫర్‌లు హార్వర్డ్‌ యూనివర్శిటీ క్యాంపస్‌లో పరిచయం అవుతారు. ఆ పరిచయం గాఢమైన స్నేహంగా మారడానికి ఎంతో కాలం పట్టదు. క్లాసిక్‌ మ్యూజిక్‌ స్టూడెంట్‌ అయిన జెన్నీ(జెన్నిఫర్‌) పై చదువుల కోసం ఫ్రాన్స్‌కు వెళ్లడానికి ప్లాన్‌ చేసుకుంటున్నానని ఆలివర్‌కు చెబుతుంది. ఆ మాట ఆలివర్‌ను పిడుగుపాటులా తాకుతుంది. ఆమె ఫ్రాన్స్‌కు వెళితే తనకేమిటి బాధ? తను ప్రేమలో పడ్డాడా? ఎస్‌...తన మనసులో మాటను ఆమెతో చెబుతాడు,....‘ఐ లవ్‌ యూ’ అని. ఆమె కూడా  ‘లవ్‌ యూ’ అంటుంది.అంతమాత్రాన కథ సుఖాంతం అవుతుందా?

అందం, ఆలోచనల విషయంలో ఇద్దరూ ఒకటే. ఆస్తుల విషయంలో మాత్రం హస్తిమశకాంతరం తేడా ఉంది. ఆలివర్‌ సంపన్నుడి వారసుడు. విలువైన వ్యాపార సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి. జెన్నీని తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళతాడు. వారికి ఆమె నచ్చదు. కారణం ఏమిటో తెలిసిందే.‘నువ్వు ఆ అమ్మాయిని మరిచిపో. నా మాట కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తి నుంచి చిల్లిగవ్వ కూడా ఇవ్వను’ అని హెచ్చరిస్తాడు తండ్రి. అయితే తండ్రి మాటని కాదని జెన్నీని పెళ్లి చేసుకుంటాడు ఆలివర్‌.

ఊహించినట్లుగానే ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. అంతమాత్రాన వారు వెనక్కి తగ్గరు. జెన్నీ ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుంది. ఈలోపు చదువు పూర్తి కావడంతో న్యూయార్క్‌ సిటీలో లా ఫర్మ్‌లో చేరుతాడు ఆలివర్‌. ఇక ఆర్థిక కష్టాలు పోయినట్లే, సంసారం గాడిన పడినట్లే అనుకుంటున్న ఆనంద సమయంలో ఆలివర్‌ను నిలువెల్లా దహించివేసే వార్త....జెన్నీకి క్యాన్సర్‌! ఇక ఎన్నో రోజులు బతకకపోవచ్చు!! మొదట ఈ దుర్వార్త ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడతాడు. కాని ఎన్ని రోజులు? ఆమెను బతికించుకోవడానికి ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి తండ్రి దగ్గర చేయి చాస్తాడు ఆలివర్‌.

అయినా ఫలితం ఉండదు. ఆమె తనకు దక్కదు. ఎటు చూసినా దుఃఖమే...ఏం మాట్లాడినా దుఃఖమే...ప్రపంచమంతా చీకటే! ఆరోజు కొడుకు వైపు చూస్తు...‘ఐయామ్‌ సారీ’ అంటాడు తండ్రి. ‘లవ్‌ మీన్స్‌...నెవర్‌ హావింగ్‌ టూ సే యూ ఆర్‌ సారీ’ అని బదులిస్తాడు కొడుకు. ఒకరోజు ఏదో సందర్భంలో ‘సారీ’ అని చెబితే జెన్నీ తనతో చెప్పిన మాట ఇది. ఈ నవల ఒక ఎత్తయితే ‘లవ్‌ మీన్స్‌...’ అనే డైలాగ్‌ ఒక ఎత్తు. బాగా పాప్‌లర్‌ అయింది. ప్రేక్షక ఆదరణ పొందిన సినిమా డైలాగుల జాబితాలో చోటుచేసుకుంది.


  

మరిన్ని వార్తలు