సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు

19 Sep, 2021 23:50 IST|Sakshi
పి.రామ్మోహన్, శేఖర్‌ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి, ఆమిర్‌ ఖాన్, చిరంజీవి, సునీల్‌ నారంగ్‌ 

‘‘కరోనా సమయంలో ఏదైనా టీజర్, ట్రైలర్‌ రిలీజ్‌ చేయమంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఓ బటన్‌ నొక్కి, దాని గురించి విష్‌ చెబితే అయిపోతుంది. అయితే ఇలా వచ్చి కళాభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలుసుకుంటూ ఈ క్లాప్స్‌ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు’’ అని హీరో చిరంజీవి అన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘లవ్‌ స్టోరి’. కె. నారాయణ్‌ దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్‌ స్టోరీ అన్‌ ప్లగ్‌డ్‌’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘నారాయణ్‌ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్‌ నారంగ్‌  తండ్రికి మించిన తనయుడయ్యాడు. ‘లవ్‌ స్టోరీ’ అనగానే చాలా ఆసక్తి కలిగింది.. ఎందుకంటే ప్రేమకథా చిత్రాలు చూసి చాలా రోజులైంది. నా మిత్రుడు నాగార్జున  కొడుకు నాగచైతన్య వెరీ కూల్‌ బాయ్‌.

యంగ్‌స్టర్స్‌ అంతా ఎగసి పడుతుంటారు.. కానీ ఎప్పుడూ కంపోజ్డ్‌గా ఉంటాడు చైతన్య. కూల్‌ ఫాదర్‌కి (నాగా ర్జున) కూల్‌ సన్‌ నాగచైతన్య. తను  నిలకడగా వెళుతుంటాడు.. అది ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి  చాలా ఉపయోగపడుతుంది. నా మిత్రుడు ఆమిర్‌ఖాన్, నాగచైతన్య నటించిన ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. సాయిపల్లవిని తొలిసారి మా వరుణ్‌ తేజ్‌ ‘ఫిదా’చిత్రంలో చూశాను. ఆ సినిమా రిలీజ్‌ అయ్యాక వరుణ్‌ వచ్చి, ‘డాడీ.. డ్యాన్స్‌ ఎలా చేశాను నేను’ అన్నాడు. ‘సారీ రా.. నేను నిన్ను చూడలేదు.. సాయిపల్లవిని మాత్రమే చూశా’ అన్నాను.

నా సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు.. అయితే తను కుదరదు అంది.. నేను కూడా అదే కోరుకున్నా. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్‌తో నేను డ్యాన్స్‌ చేయాలనుకుంటాను కానీ ‘చెల్లెమ్మా’ అని పిలవగలనా?.. పిలవలేను. నా పక్కన రొమాంటిక్‌ హీరోయిన్‌గా చేయగలిగితే ఓకే. శేఖర్‌ కమ్ముల ఎవరి వద్దా పనిచేయకపోయినా సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ అయ్యాడు. ‘లవ్‌ స్టోరీ’ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో నో డౌట్‌’’ అన్నారు. 

హీరో ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ – ‘‘లవ్‌ స్టోరీ’ ట్రైలర్‌ చూసి, బాగుందని చైతూకు(నాగచైతన్య)  మెసేజ్‌ చేశా. నా ‘లాల్‌సింగ్‌ చద్దా’ చిత్రంలో తను నటించారు. నా సినిమా సెట్స్‌లో చైతన్యను ఫస్ట్‌టైమ్‌ చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉన్న ఫీలింగ్‌ కలిగింది. చైతూ చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, సంస్కారవంతుడు. ‘లవ్‌ స్టోరీ’ చిత్రాన్ని థియేటర్స్‌లోనే చూస్తాను. ముంబయ్‌లో థియేటర్స్‌లో స్క్రీనింగ్‌కు ఇబ్బందులు ఉంటే అధికారుల అనుమతితో ప్రత్యేక స్క్రీనింగ్‌లో అయినా చూస్తాను’’ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ–‘‘లవ్‌ స్టోరీ’ ట్రైలర్‌ చూస్తుంటే నాగ చైతన్య, సాయి పల్లవి బాగా నటించారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలు విడుదల చేసేందుకు చాలా మంది నిర్మాతలు భయపడతున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. తమ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ‘లవ్‌ స్టోరీ’ నిర్మాతలకు అభినందనలు. ఇండస్ట్రీపై ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. వాళ్లు బాగుండాలంటే సినిమా అన్ని సెక్టా ర్లలో పుంజుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ వేడుకకి వచ్చిన చిరంజీవి, ఆమిర్‌ ఖాన్‌గార్లకు థ్యాంక్స్‌. నాగచైనత్య, సాయిపల్లవి, శేఖర్‌ కమ్ములతో పాటు మా ‘లవ్‌ స్టోరీ’ చిత్ర యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు కె. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌. 

నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మీరు(చిరంజీవి) నాకు ఆన్‌స్క్రీన్‌ మెగాస్టార్‌. ఆఫ్‌ స్క్రీన్‌ మెగా హ్యూమన్‌ బీయింగ్‌. కరోనా కష్టకాలంలో మీరు ఇండస్ట్రీకి సపోర్ట్‌ చేసిన తీరు స్ఫూర్తిదాయకం. ‘లవ్‌ స్టోరీ’ ట్రైలర్‌ చూసి, అభినందించి ఈ వేడుకకు వస్తానని ఆమిర్‌ఖాన్‌గారు వచ్చారు. ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమా కోసం 45 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆమిర్‌గారి నుంచి నేను నేర్చుకున్న విషయాలు నాకు జీవితాంతం ఉపయోగపడతాయి.

‘లవ్‌ స్టోరీ’ లో ఇంతలా పెర్ఫార్మ్‌ చేశానంటే అందుకు కారణం శేఖర్‌ కమ్ములగారే. సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నందుకు  మా నిర్మాతలకు ధన్యవాదాలు. యాభైఏళ్ల క్రితం తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ‘ప్రేమ్‌నగర్‌’ సినిమా విడుదలైన తేదీనే ‘లవ్‌స్టోరీ’ వస్తోంది.. అన్నీ రాసిపెట్టినట్లుగా అనిపిస్తోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు శరత్‌ మరార్, భరత్‌ నారంగ్, అభిషేక్‌ అగర్వాల్, కెమెరామెన్‌ విజయ్‌ సి.కుమార్, సంగీత దర్శకుడు పవన్‌ సి.హెచ్, ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్, పాటల రచయితలు భాస్కర భట్ల, సురేంద్ర, ఆదిత్య మ్యూజిక్‌ అధినేత ఉమేష్‌ గుప్తా, నటి ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. 

‘‘కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ సక్సెస్‌ రేట్‌ మహా అయితే 20శాతం. ఈమాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందనుకుంటారు. కానీ, కష్టాలు పడేవారు, సాధక బాధకాలు అనుభవించే వారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. ఇలాంటి వారంతా కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఓ నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కలిస్తే కాదు. కరోనా సమయంలో షూటింగ్స్‌ ఆగిపోవడంతో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ప్రత్యక్షంగా చూశాం. ఏ విపత్తు వచ్చినా సాయానికి ముందుండేది మా సినిమా ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున సంక్షోభంలో పడిపోయింది.. సినిమా నిర్మాణం ఖర్చు పెరిగిపోయింది.. ఈ వేదికగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను మా విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ 
– చిరంజీవి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు