అందుకే ఈ సినిమా హిట్టవ్వాలనుకుంటున్నా!

24 Sep, 2021 00:00 IST|Sakshi

‘‘లవ్‌స్టోరీ’ సినిమాపై యూనిట్‌ అంతా చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ పూర్తి స్థాయిలో థియేటర్లకు రావడం లేదు. వారందర్నీ మా సినిమా థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నాగచైతన్య. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు.

కరోనా లాక్‌డౌన్‌ వల్ల సినిమా ఇండస్ట్రీ బాగా ఇబ్బందుల్లో పడింది. మళ్లీ మునుపటి రోజులు రావాలని, పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను. ‘లవ్‌స్టోరీ’ సినిమా మా కోసం కాకున్నా చిత్రపరిశ్రమకు మంచి బూస్ట్‌ ఇచ్చేందుకు అయినా హిట్‌ కావాలనుకుంటున్నాను. ‘లవ్‌స్టోరీ’లో తెలంగాణ యాస కోసం కొన్ని రోజులు ప్రాక్టీస్‌ చేశాం.. డబ్బింగ్‌ చెప్పే టైమ్‌కు లాక్‌డౌన్‌ వచ్చింది. దీంతో ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది. 

శేఖర్‌ కమ్ములగారిలో సినిమా పట్ల నిజాయతీ, అంకితభావం నెక్ట్స్‌ లెవల్‌లో ఉంటాయి. ఆయనతో పని చేసేవారికి ఎంతో ఉపయోగం. శేఖర్‌గారి చిత్రాల్లో రియలిస్టిక్‌ అప్రోచ్‌ ఉంటుంది. సమాజానికి, వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రాలంటే నాకూ ఆసక్తే. కమర్షియల్‌ సినిమాల్లో ఎవరైనా పెద్ద సందేశం ఇస్తారు. కానీ లింగ వివక్ష, కుల వివక్ష వంటి సమస్యలను చూపించడం గొప్ప విషయం. వాటిని ఈ సినిమాలో చూపించారు. ‘మజిలీ’ సినిమాతో నాకు కొంచెం సంతృప్తి దొరికింది.. ‘లవ్‌స్టోరీ’ చిత్రం పూర్తి స్థాయి సంతృప్తి ఇచ్చింది. మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్‌ ఇష్యూను శేఖర్‌గారు ఈ చిత్రంలో పల్లవి అనే పాత్ర ద్వారా చెప్పారు. ఆయనతో పని చేసిన తర్వాత నటుడిగా, వ్యక్తిగా ఎదిగాను. అందుకే ఆయనతో ఎప్పుడూ ప్రయాణం చేయాలనిపిస్తోంది. 

ప్రేక్షకుల ఆలోచనా విధానం మారింది.. వాస్తవానికి దగ్గరగా ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారనే విషయాన్ని నేను, సుకుమార్‌గారు మాట్లాడుకున్నాం. ఆయన కూడా ‘రంగస్థలం’ నుంచి ఇదే తరహాలో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. ప్యాన్‌ ఇండియా మార్కెట్‌ గురించి నాకు తెలియదు. ప్యాన్‌ ఇండియా కోసం స్క్రిప్ట్‌ రాస్తే ప్రాంతీయ విషయాలు మిస్‌ అవుతాం.

ఆమిర్‌ ఖాన్‌గారితో ‘లాల్‌సింగ్‌ చద్దా’ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం 45 రోజులు ఆయనతో చేసిన ప్రయాణం నాకు చాలా ప్లస్‌ అయింది. ఇండస్ట్రీకొచ్చిన ఈ 12ఏళ్లలో నేర్చుకున్నదాని కంటే ఎక్కువే నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘థ్యాంక్యూ’ చిత్రం పది  రోజుల షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. అలాగే ‘బంగార్రాజు’లో నటిస్తున్నాను.

శేఖర్‌గారి గత చిత్రాల్లో హీరోయిన్‌ పాత్రకు ఎక్కువ పేరొచ్చింది. కానీ ‘లవ్‌స్టోరీ’లో సాయిపల్లవితో పాటు నా పాత్రకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. ఇద్దరికీ మంచి పేరొస్తుంది. సాయిపల్లవి మంచి నటి, డ్యాన్సర్‌. డ్యాన్స్‌ విషయంలో నేను చాలా టేక్స్‌ తీసుకున్నాను. సాంగ్‌ షూట్‌ అంటే నాకు గతంలో భయంగా ఉండేది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా నుంచి శేఖర్‌ మాస్టర్, నా కాంబినేషన్‌ బాగా వర్కవుట్‌ అవుతోంది. ‘లవ్‌స్టోరీ’ చిత్రంలోనూ నాతో మంచి స్టెప్పులు వేయించారాయన.

మరిన్ని వార్తలు