Love story Review: చైతూ, సా​యి పల్లవిల ‘లవ్‌స్టోరి’ ఎలా ఉందంటే..

24 Sep, 2021 13:16 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : లవ్‌స్టోరి
నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్
నిర్మాతలు :  కె. నారాయణ్‌దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు
దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల
సంగీతం : పవన్‌ సీహెచ్‌ 
సినిమాటోగ్రఫీ :  విజయ్‌.సి.కుమార్‌
ఎడిటింగ్‌: మార్తాండ్ కె వెంకటేష్
విడుదల తేది : సెప్టెంబర్‌ 24, 2021

సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్‌స్టోరి సినిమా చేశాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు( సెప్టెంబర్‌24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘లవ్‌స్టోరి’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

‘లవ్‌స్టోరీ’కథేంటంటే?
అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌(నాగ చైతన్య) ఏదైనా బిజినెస్‌ చేయాలని నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జుంబా డ్యాన్స్‌ సెంటర్‌ నడుపుతుంటాడు. రేవంత్‌ గ్రామానికే చెందిన మౌనిక(సాయి పల్లవి) బిటెక్‌ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో రేవంత్‌ జుంబా సెంటర్‌లో పార్ట్‌నర్‌గా జాయిన్‌ అవుతుంది. ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు కలిగిన రేవంత్‌, మౌనికల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది కాస్త నిదానంగా ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మధ్యలో కులం అడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి వారిద్దరి ప్రేమ కథా వ్యవహారం ఎలా నడిచింది? కులాల అడ్డంకి దాటుకొని చివరకు మౌనిక, రేవంత్‌ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగిలిన కథ.

ఎలా చేశారంటే.. ?
రేవంత్‌ పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా డ్యాన్స్‌ విషయంగా చైతూ చాలా మెరుగయ్యాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కష్టమైన స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇక మౌనిక పాత్రలో సాయి పల్లవి ఎప్పటి మాదిరే పరకాయ ప్రవేశం చేసింది. సాయి పల్లవి డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టమైన స్టెప్పులను ఈజీగా వేసి అదరగొట్టేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై రేవంత్‌, మౌనిక పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్ప చైతూ, సాయి పల్లవిలు అస్సలు కనిపించరు. హీరో తల్లిపాత్రలో ఈశ్వరీరావు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. మౌనిక బాబాయి నరసింహం పాత్రలో రాజీవ్‌ కనకాల మెప్పించాడు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌ తనది. హీరోయిన్‌ తల్లిగా దేవయాని, ఎస్సైగా ఉత్తేజ్‌ తమ పాత్రల పరిధిమేర నటించారు. 


ఎలా ఉందంటే..?
సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ చాలా మంది సంకోచిస్తున్నారు. ఆయా సమస్యలపై వచ్చిన కథనాలు చదివితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి సున్నితమైన పాయింట్‌ని తీసుకొని, తెరపై అతి సున్నితంగా చూపించాడు శేఖర్‌ కమ్ముల. పాత్రల నేపథ్యం చాలా నేచురల్‌గా ఉంటుంది. సినిమాల్లో కొన్ని ఎమోషన్స్‌ బాగా ఎలివేట్‌ చేసినా.. స్లోగా సాగే సీన్స్‌ ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్స్‌ మధ్య వచ్చే కొన్ని సీన్స్‌ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతుంది, సెకండాఫ్‌ వచ్చేసరికి కథలో ఎమోషన్స్‌ ఎక్కువైపోతాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. 

ఈ సినిమాకు మరో ప్రధాన బలం పవన్‌ సీహెచ్‌ సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్‌కి ప్రాణం పోశాడు. విజయ్‌.సి.కుమార్‌ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లెటూరి విజువల్స్‌ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటర్‌ మార్తాండ్ కె వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్‌ మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బ్యానర్‌ స్థాయికి తగినట్లుగా ఉంది. మొత్తంగా చెప్పాలంటే ‘లవ్‌స్టోరి’ ఓ మంచి సందేశాత్మక చిత్రం. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3/5)
మరిన్ని వార్తలు