ప్రేమకథా చిత్రమ్‌ 

14 Feb, 2023 01:26 IST|Sakshi

‘ప్రేమకథ’లు చూడ్డానికి బాగుంటాయి. గాఢమైన ‘ప్రేమ కథలు’ అయితే మనసులో నిలిచిపోతాయి. దుష్యంతుడు, శకుంతలది అలాంటి ప్రేమకథే. కొన్నేళ్ల పాటు దూరంగా ఉన్నా వీరి ప్రేమ బలమైనది కాబట్టే నిలబడింది. ఈ ప్రేమకథని త్వరలో వెండితెరపై చూడనున్నాం. మరికొన్ని ప్రేమకథలు కూడా రానున్నాయి. ఒక్కో ‘ప్రేమకథా చిత్రమ్‌’ది ఒక్కో కథ. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. 

ప్రేమకావ్యాల్లో ‘అభిజ్ఞాన శాకుంతలం’ది ప్రత్యేకమైన స్థానం. కాళిదాసు రచించిన ఈ ప్రేమకథ ఆధారంగా ఆల్రెడీ కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా దర్శకుడు గుణశేఖర్‌ ‘శాకుంతలం’ సినిమా తీశారు. ఇందులో  దుష్యంతుడిగా దేవ్‌ మోహన్, శకుంతలగా సమంత నటించారు. దుష్యంత మహారాజు, శకుంతల ప్రేమ చుట్టూ ఈ సినిమా సాగు తుందన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఓ కొత్త ప్రేమకథతో ఖుషీగా రానున్నారు విజయ్‌ దేవరకొండ–సమంత. ఈ ఇద్దరూ జంటగా శివ నిర్వాణ దర్శకత్వం  వహిస్తున్న చిత్రం ‘ఖుషి’. ‘ఒక రొమాంటిక్‌ ప్రేమకావ్యం నిర్మాణంలో  ఉంది’ అని విజయ్, ‘కుటుంబమంతా చూసి మంచి అనుభూతికి గురయ్యే సినిమా’ అని సమంత ‘ఖుషి’ అప్‌డేట్‌ అప్పుడు పేర్కొన్నారు.

సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి చిన్న బ్రేక్‌ పడింది. ఏది ఏమైనా ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటోంది యూనిట్‌. మరోవైపు హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ కాంబినేషన్‌లో 2018లో వచి్చన లవ్‌స్టోరీ ‘గీత గోవిందం’ సూపర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా విజయ్, పరశురామ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది లవ్‌స్టోరీ ఫిల్మ్‌ అని, ‘గీత గోవిందం’కు సీక్వెల్‌ అనే ప్రచారం తెరపైకి  వచ్చ్చింది . ఇదే నిజమైతో విజయ్‌ వెంట వెంటనే ప్రేమకథా చిత్రాల్లో  నటించినట్లు అవుతుంది. ఇక అబ్బాయి, అమ్మాయి స్నేహం ప్రేమగా మారిన ఎన్నో కథలు వెండితెరపైకి వచ్చాయి. ప్రేక్షకుల మనసులను మెప్పించాయి. ఈ కోవలో రానున్న మరో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. అబ్బాయి సంజయ్‌ పీసపాటి, అమ్మాయి అనుపమా కస్తూరిల ప్రేమకథ ఇది. 

సంజయ్‌ పాత్రలో  నాగ సౌర్య , అనుపమ పాత్రలో మాళవికా నాయర్‌ నటించారు. ఫ్రెండ్‌షిప్, లవ్, బ్రేకప్‌ అంశాల మేళవింపుతో దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 17న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఇంకోవైపు ‘మొదటి ప్రేమకు మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’  అంటున్నారు ఆనంద్‌ దేవరకొండ. సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఆనంద్‌ హీరోగా, విరాజ్‌ అశి్వన్, వైష్ణవి చైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. ఫస్ట్‌ లవ్‌ కాన్సెప్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక శ్రీదేవి ఎక్కడుంటే శోభన్‌బాబు అక్కడే  ఉంటాడట. ఎందుకంటే ప్రేమంట.

సంతోష్‌ శోభన్, గౌరి జి కిషన్‌ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వంలో  రూపొందిన లవ్‌స్టోరీ ‘శ్రీదేవి శోభన్‌బాబు’.  ఇందులో శోభన్‌బాబుగా సంతోష్‌ శోభన్, శ్రీదేవిగా గౌరి కనిపిస్తారు. ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్‌ కానుంది. ఇంకోవైపు ‘ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం’తో ఫేమ్‌ సంపాదించుకున్న హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఫోన్‌ నంబర్‌ నైబర్‌హుడ్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ప్రేమకథా చిత్రంలో  కాశ్మీర హీరోయిన్‌గా నటించగా, కిశోర్‌ డైరెక్టర్‌ చేశారు. ఈ చిత్రం కూడా ఈ నెల 18న రిలీజ్‌ కానుంది.   ఇవి కాక మరికొన్ని ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాయి. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు