డైరెక్టర్‌ శంకర్‌పై నిర్మాతల కేసు!

2 Apr, 2021 03:27 IST|Sakshi

‘ఇండియన్‌  2’ షూటింగ్‌ను దర్శకుడు శంకర్‌ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈ సినిమా శంకర్‌ కెరీర్‌ను ఇబ్బందిపెడుతూనే ఉంది. గత ఏడాది ఈ సినిమా షూటింగ్‌లో ప్రమాదం జరిగి, నలుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత సినిమా మళ్ళీ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈలోపు ‘ఇండియన్‌  2’లో హీరోగా నటిస్తున్న కమల్‌హాసన్‌  రాజకీయంగా బిజీ అయిపోయారు. ఇటు శంకర్‌ కూడా రామ్‌చరణ్‌తో ఓ ప్యాన్‌  ఇండియన్‌  సినిమా చేసేందుకు కథ రెడీ చేసుకున్నారు. ‘దిల్‌’ రాజు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ‘ఇండియన్‌  2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ దర్శకుడు శంకర్‌కు షాక్‌ ఇచ్చింది. 

‘ఇండియన్‌ 2’ను పూర్తి చేయకుండా శంకర్‌ మరో ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ,మద్రాస్‌ హైకోర్టులో కేసు ఫైల్‌ చేసింది. ‘‘ఇండియన్‌ 2’ బడ్జెట్‌ రూ. 236 కోట్లనుకున్నాం. ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌కు రూ. 180 కోట్లు ఖర్చు అయ్యాయి. లాగే శంకర్‌కు మేం ఇస్తామన్న 40 కోట్ల పారితోషికంలో ఆల్రెడీ 14 కోట్లు చెల్లించాం. మిగిలిన 26 కోట్ల రూపాయలను కూడా కోర్టు సమక్షంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని లైకా ప్రొడక్షన్స్‌ తమ పిటిషన్‌ లో పేర్కొందని కోలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. అయితే దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్‌ మధ్య తలెత్తిన ఈ వివాదం ఎలాంటి పరిష్కారంతో ముగుస్తుందనే చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 1996లో కమల్‌హాసన్‌  హీరోగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్‌ ’కు సీక్వెల్‌గా ‘ఇండియన్‌  2’ తెరకెక్కుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు