ఆరుల్ నిధి ప్రత్యేక పాత్రలో వస్తున్న 'తురువిన్ కురల్'

17 Feb, 2023 09:28 IST|Sakshi

ప్రస్తుతం వరుసగా చిత్రాలను నిర్మిస్తున్న సంస్థ లైకా ప్రొడక్షన్స్‌. భారీ చిత్రాలతో పాటు, వైవిధ్యభరిత కథాంశంతో కూడిన చిన్న చిత్రాలను ఈ సంస్థ నిర్మించడం విశేషం. ఈ సంస్థ అధినేత సుభాస్కరన్‌ ఇటీవలే దర్శకుడు మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్‌ సంస్థతో కలిసి చారిత్రక కథా చిత్రం పొన్నియిన్‌ సెల్వన్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌ను ఏప్రిల్‌ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా.. మరికొన్ని చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో ఒకటి తురువిన్‌ కురల్‌. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 24వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో నటుడు అరుళ్‌ నిధి కథానాయకుడుగా నటించారు. హరీష్‌ ప్రభు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటి ఆత్మిక కథానాయకిగా నటించిన ఇందులో దర్శకుడు భారతీయ ముఖ్యపాత్రలు పోషించారు.

కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయిందని దర్శకుడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, పాండిచ్చేరి, కారైక్కాల్‌  ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. ఇది తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో అరుళ్‌ నిధి బధిరుడు(చెవిటి)పాత్రను పోషించడం విశేషం అన్నారు. చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని, సింటో పోదుతాస్‌ ఛాయాగ్రహణం సమకూర్చారు.
 

మరిన్ని వార్తలు