MAA Elections 2021: నాగబాబు వ్యాఖ్యలు షాక్‌కి గురిచేశాయి: నరేశ్‌

26 Jun, 2021 11:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాగబాబు మాకు మంచి మిత్రుడు. అతనితో అనేకసార్లు కలిసి పని చేశాను. ‘మా’తరపున మేం చేసిన  చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెప్పాం. అయినా కూడా నాలుగేళ్లుగా  'మా' మసకబారిపోయిందని నాగబాబు అనడం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది’అని అన్నారు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు సీనియర్‌ నరేశ్‌. శుక్రవారం ప్రెస్‌ మీట్‌లో‘మా’పై ప్రకాశ్‌ రాజ్‌, నాగబాబు చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా శనివారం ఉదయం నరేశ్‌ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో ‘మా’ కోసం తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

‘నాకు కథలు చెప్పడం అలవాటు లేదు. కాగితాలతో రావడమే అలవాటు. ఎవర్నో ధూషించడానికో, ఎవరిపైనో కాలు దువ్వడానికో ఈ సమావేశం పెట్టలేదు. నరేశ్‌ అంటే ఏంటని నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను సినిమా వాడిని. ‘మా’ బిడ్డను. సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ముందు ఉంది. ప్రకాశ్‌రాజ్‌ నాకు మంచి మిత్రుడు. ఎప్పుడో మూడు నెలల క్రితమే నాకు ఫోన్‌ చేసి ఈ ఏడాది ఎలక్షన్‌లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాల్లో నటించేవాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చని చెప్పాను. మంచు విష్ణు.. ఇండస్ట్రీ బిడ్డ.. కష్టనష్టాలు చూడకుండా సినిమాలు చేస్తూ వేలాది మందికి అన్నం పెడుతున్నారు’ అని నరేశ్‌ అన్నారు.

రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం
‘‘మా’లో మొత్తం 914 మంది జీవితకాల సభ్యులు ‌, 29 మంది అసోసియేట్‌ సభ్యులు, 18 మంది సీనియర్‌ సిటిజన్స్‌ ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి సుమారు 728 మంది సభ్యులకు రూ.3 లక్షలతో జీవిత బీమా చేయించాం. ఇప్పటివరకూ మృతిచెందిన 16 మంది సినీ ఆర్టిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షలు అందజేశాం. 314 మంది సభ్యులకు ఆరోగ్య బీమా చేయించాం. రూ.3 వేలు ఉన్న పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాం. ‘మా’ సభ్యత్వ నమోదును రూ.లక్ష నుంచి రూ.90 వేలకు తగ్గించాం. కొత్తగా 87మంది సభ్యులు అసోసియేషనలో చేరారు.‘మా’పై నమ్మకం లేకపోతే ఎలా చేరతారు?. జాబ్‌ కమిటీ ద్వారా 35 మంది వృద్ధ కళాకారులకు సినిమాల్లో అవకాశం కల్పించాం.

కరోనా కష్టకాలంలో ‘మా’ అసోసియేషన్‌కు రూ.30 లక్షల విరాళాలు అందాయి. అందులో జీవిత రూ.10 లక్షలు అందించారు. వాటిలో రూ.లక్షను చిరంజీవి ఏర్పాటు చేసిన సీసీసీకి పంపిచాం. మేము చేసిన పనికి చిరు ఫోన్‌ చేసి అభినందించారు. అలాగే, నేను జాయింట్‌ సెక్రటరీగా ఉన్నప్పుడు అసోసియేషన్‌లో నిధులు తక్కువగా ఉన్నాయని చెప్పగానే మా అమ్మ విజయనిర్మల రూ.5 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ తర్వాత కూడా విరాళాలు అందించారు. ఇలా ఆమె మొత్తం రూ.30 లక్షలు ఇచ్చారు. అసోసియేషన్‌లో నేను 20 ఏళ్లుగా సభ్యుడిగా ఉన్నప్పటికీ ఎలాంటి పదవీ ఆశించలేదు. కావాలంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పదవుల కోసం ఆశపడడం లేదు. సాయం అడిగిన ప్రతి ఒక్కరికీ నా వంతు సాయం చేస్తూనే ఉన్నాను. కానీ, ఇప్పుడు మేము చేసిన పనుల్ని తక్కువగా చేసి మమ్మల్ని ఎందుకు హింసిస్తున్నారు. మేము హింసకు లొంగం’అని నరేశ్‌ అన్నారు.


మరిన్ని వార్తలు