Maa Elections 2021: ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణంపై బండ్ల గణేశ్‌ సంచలన వ్యాఖ్యలు

19 Aug, 2021 16:25 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.  ఎప్పుడు లేనంతగా ఈ సారి  అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. వీరిలో ప్రకాశ్‌ రాజ్‌ అయితే ఒక అడుగు ముందుకేసి ‘సినిమా బిడ్డలు’పేరుతో తన ప్యానల్‌ను కూడా ప్రకటించాడు.
(చదవండి: మనసు మార్చుకున్న బండ్ల గణేష్‌..ఆనందంలో ఫ్యాన్స్‌)

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ ముందు నుంచి మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఓ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ఎన్నికలు, భవనం నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘మా’కు శాశ్వత భవనం అవసరం లేదన్నారు. 

ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిఒక్కరూ ‘మా’కు శాశ్వత భవనం నిర్మించడమే ప్రధాన అజెండాగా బరిలోకి దిగుతున్నారు. నిజం చెప్పాలంటే నేను ‘మా’ బిల్డింగ్‌కు వ్యతిరేకిని. దానికంటే ముందు చేయాల్సిన పనులో ఎన్నో ఉన్నాయి. ‘మా’లో ఉన్న 900 మందిలో చాలా వరకు దారిద్ర్యపు రేఖకు దిగువన ఉన్నారు. సరైన ఆర్థిక స్థోమతలేక ప్రతి నెలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం.. బిల్డింగ్‌ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి, ఉచితంగా ఇస్తే బాగుంటుంది. ఇలాంటి పని కోసం మన హీరోలు కూడా ముందుకు వస్తారు. ప్రస్తుతం ‘మా’కి బిల్డింగ్‌ లేకపోతే ఇండస్ట్రీ ఆగిపోదు. సినిమా షూటింగ్స్‌ నిలిచిపోవు. సినిమాలు చూసే వాళ్లు తగ్గిపోరు’అని బండ్ల గణేశ్‌ అన్నారు.
(చదవండి : ‘రాజ రాజ చోర’ మూవీ రివ్యూ)

మరిన్ని వార్తలు