MAA Elections 2021: 'మా' అధ్యక్ష పదవి కోసం పెరిగిన పోటీ!

28 Jun, 2021 12:49 IST|Sakshi

రసవత్తరంగా 'మా' అధ్యక్ష ఎన్నికలు

బరిలో ఓ.కల్యాణ్‌!

సాక్షి, హైదరాబాద్: 'మా' అధ్యక్ష ఎన్నికలు రంజుగా సాగుతున్నాయి. అధ్యక్ష పదవి కోసం రోజుకొకరు రంగంలోకి దిగుతుండటంతో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు సీనియర్‌ నటులు ప్రకాశ్‌రాజ్‌, సీవీఎల్‌ నరసింహారావు, యంగ్‌ హీరో మంచు విష్ణు, సీనియర్‌ నటీమణులు జీవితా రాజశేఖర్‌, హేమ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా మరో అభ్యర్థి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఓ.కల్యాణ్‌ కూడా పోటీకి సై అంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా వెల్లడించనున్నాడు. 

ఎవరి బలాలు, బలగాలు ఎంత?
మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థలు విషయానికి వస్తే.. ముందునుంచీ 'మా' ఎన్నికలపై బాగా ఫోకస్‌ పెట్టిన ప్రకాశ్‌ రాజ్‌ అందరి కంటే ముందుగా తన ప్యానల్‌ సభ్యుల వివరాలను ప్రకటించారు. జయసుధ, శ్రీకాంత్‌, యాంకర్‌ అనసూయ, బండ్ల గణేశ్‌, సుడిగాలి సుధీర్‌, బ్రహ్మాజీ, సాయికుమార్‌తో కలిపి మొత్తం 27 మంది ఈ ప్యానెల్‌లో ఉన్నారు. మెగా బ్రదర్‌ నాగబాబు కూడా ప్రకాశ్‌రాజ్‌కే మద్దతిస్తున్నట్లు వెల్లడించాడు. దీంతో చిరంజీవి ఆశీస్సులు, అండదండలు కూడా ఈయనకే ఉన్నట్లు చర్చ నడుస్తోంది.

ఇక ఇండస్ట్రీకి ఎంతో రుణపడ్డామని, అలాంటి చిత్రపరిశ్రమకు సేవ చేస్తానంటూ ముందుకు వచ్చాడు మంచు విష్ణు. తండ్రి మోహన్‌బాబు ఆశీస్సులతో బరిలోకి దిగిన ఆయన యువరక్తాన్ని గెలిపించాలని కోరుతున్నాడు. ఇక ట్రెజరర్‌ పదవికి పోటీ చేయాలనుకున్న నటి హేమ తనవారి కోరిక మేరకు రేస్‌లోకి దిగుతున్నట్లు చెప్పారు. అయితే ఆమెకు ఎవరు మద్దతిస్తున్నారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. జీవితా రాజశేఖర్‌కు నందమూరి బాలకృష్ణ సపోర్ట్‌ ఉందంని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన ప్యానల్‌ తెలంగాణ వాదమని, సినిమా అవకాశాల్లో తెలుగువారికి న్యాయం జరగాలంటూ నినాదమెత్తుకున్నారు నరసింహారావు. 'మా'ని రెండు విభాగాలుగా చేయాలన్న కొత్త ప్రతిపాదనను సైతం తెర మీదకు తీసుకొచ్చాడు. మరి ఆయనకు సపోర్ట్‌ చేసేదెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

వెయ్యి మందికి లోపే సభ్యులున్న మా అసోసియేషన్‌ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. మరి అప్పటిలోపు ఇంకా ఎంతమంది పేర్లు తెర మీదకు వస్తాయి. పోటీదారుల సంఖ్య పెరగనుందా? టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎవరి వెనకాల నిలబడతారు? మా రాజకీయం ఎటువైపు మలుపు తిరగనుంది? అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

చదవండి: MAA Elections 2021: 'మా' సభ్యుల బాధలు తెలుసన్న మంచు విష్ణు

మరిన్ని వార్తలు