‘మా’ కార్యవర్గ ప్రమాణ స్వీకారం, హాజరు కాని ప్రకాశ్‌ రాజ్‌

16 Oct, 2021 11:57 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్‌ నుంచి గెలుపొందిన 15మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది.

చదవండి: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!

కాగా ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో  నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నటుడు మోహన్‌ బాబు, నరేష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని.. కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ‘మా’ కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే విష్ణు సతిమణి విరానిక వారి పిల్లులు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా ఈ కార్యక్రమానికి ‍మరో ముఖ్య అతిథిగా బాలకృష్ణ రావాల్సి ఉండగా ఆయన హాజరు కాలేకపోయారు. శుక్రవారం బాలయ్య ఇంటికి వెళ్లి ఆయనను మోహన్‌ బాబు, విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానిచ్చిన సంగతి తెలిసిందే. 

చదవండి: Unstapable Talk Show: ‘అన్‌స్టాపబుల్’ టాక్‌ షోకు బాలయ్య షాకింగ్‌ రెమ్యునరేషన్‌

కాగా ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ ఓడిపోగా, ఆయన ప్యానల్‌ నుంచి 11 మంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాల విడుదలైన తర్వాత రోజు ప్రకాశ్‌ రాజ్‌తో పాటు ఆయన ప్యానల్లో గెలిచిన సభ్యులు అనూహ్యంగా విష్ణు ప్యానల్‌తో కలిసి తాము పనిచేయలేమంటూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ప్రకాశ్‌రాజ్‌, అతని ప్యానల్‌ సభ్యులెవరూ హాజరు కాలేదు. మరోవైపు, ఇటీవల బాలకృష్ణను కలిసిన మంచు విష్ణు చిరంజీవిని సైతం కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమంలో చిరంజీవి కానీ.. మెగా హీరోలెవరు కనిపించకపోవడం గమనార్హం.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు