ప్రకాశ్‌ రాజ్‌ సంతోషంగా సీసీటీవీ పుటేజ్‌ చూసుకొవచ్చు: మంచు విష్ణు

18 Oct, 2021 11:30 IST|Sakshi

గేమ్‌ ఆడిన వారికంటే చూసిన వారికే ఎక్కువ ఎగ్జైట్‌మెంట్‌ ఉందని అర్థం అవుతుందని ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. శనివారం ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. అనంతరం శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థలో తన ప్యానల్‌ సభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేసి తమ గెలుపును సెలబ్రెట్‌ చేసుకున్నారు. 

ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బాబూ మోహన్‌తో పాటు మొత్తం తమ ప్యానల్‌ సభ్యుల కలిసి ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్నామన్నారు. ఈ ఎన్నికల్లో తమ గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి పేరుపేరున మంచు విష్ణు ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ గెలుపు నా ప్యానల్‌ది.. మా అందరిది. మా ప్యానల్లో ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే నాకు ఓట్లు పడ్డయి. వారందరికి నా కృతజ్ఞతలు. ప్రతి పోటీలో గెలుపు-ఓటములు సహజం. ఈ సారి మేము గెలిచాం. ఇది మా అందరి కష్టం. ఈ సారి వాళ్లు గెలవలేదు. ఐ విష్‌ బెటర్‌ లక్‌ నెక్ట్‌టైం’ అని వ్యాఖ్యానించారు. 

అలాగే ప్రుకాశ్‌ రాజ్‌ ఆరోపణలపై స్పందించిన మంచు విష్ణు.. ‘ప్రకాశ్‌ రాజ్‌ సంతోషంగా సీసీ పుటేజ్‌ను చూడొచ్చు. మేము ప్రజాస్వామ్య బద్ధంగానే గెలిచాం. ఎన్నికల సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఇరువైపుల జరిగి ఉండోచ్చు. దీంతో మా మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయి తప్ప అక్కడ ఏం జరగలేదు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్లో గెలిచిన వారి రాజీనామాలు మేము మీడియా ద్వారానే విన్నాం. ఇప్పటి వరకు నాకు ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామానే అందింది. మిగతా ఆయన ప్యానల్‌ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు’ అని విష్ణు స్పష్టం చేశారు. అలాగే ప్రకాశ్‌ రాజ్‌, నాగబాబుల రాజీనామాలు తాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు.  

మరిన్ని వార్తలు