MAA Elections 2021: ‘మా’ ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ

5 Oct, 2021 16:02 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలు మరింత వేడుక్కుతున్నాయి. నువ్వా? నేనా? అన్నట్లుగా అభ్యర్థులు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) ప్రకాశ్‌ రాజ్‌.. మంచు విష్ణు ప్యానెల్‌పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ‘మా’ ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

చదవండి: Prakash Raj: మంచు విష్ణు ప్యానెల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదు

తాజాగా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశాడు. అక్టోబర్‌ 10న జరిగే ‘మా’ ఎన్నికలను బ్యాలెట్‌ విధానంలో నిర్వహించాలని విష్ణు తన లేఖలో కోరాడు. ‘ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉంది. ఈవీఎంలపై మా ప్యానల్‌ సభ్యులకు నమ్మకం లేదు. పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఈసారి ‘మా’ పోలింగ్ నిర్వహించాలి. బ్యాలెట్‌ విధానంలోనే పారదర్శకత ఉంటుంది. పేపర్‌ బ్యాలెట్‌ కల్పిస్తే ఈ సారి సీనియర్లు చాలా మంది వచ్చి ఓటు వేసే అవకాశం ఉంది’ అని మంచు విష్ణు తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

చదవండి: 'మా' ఎన్నికలు:  ఎన్టీఆర్‌ ఓటుపై జీవిత ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక తన ప్యానెల్‌ సభ్యులు శ్రీకాంత్‌, జీవితలతో కలిసి ఎ‍న్నికల అధికారికి ప్రకాశ్‌ రాజ్‌ ఈ రోజు ఉదయం ఫిర్యాదు చేశాడు. ఎన్నికల నియమావళిని విష్ణు ప్యానెల్‌ ఉల్లంఘిస్తుందని ప్రకాశ్‌ రాజ్‌ ఆరోపించాడు. ‘‘మా’ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ దుర్వినియోగం అవుతుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్లు పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులు ఏజెంట్ల ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర చేస్తున్నారు. 60 మందితో పోస్టల్‌ బ్యాలెట్‌లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారు. కృష్ణం రాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి’ అంటూ  ప్రకాశ్‌ రాజ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.  కాగా ఈ సారి అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. 

మరిన్ని వార్తలు