MAA Elections: ‘నాకు, శ్రీకాంత్‌కు నరేశ్‌ క్షమాపణలు చెప్పేవరకు తిడుతూనే ఉంటా’

8 Oct, 2021 19:12 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ఒకవైపు దగ్గర పడుతుంటే, మరోవైపు అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపస్తున్నాయి. ఇక లోకల్‌-నాన్‌ లోకల్‌ అనే అంశంగా కూడా ఈ ఎన్నికల్లో వినిపిస్తోంది. అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం ఎన్నికల వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా నటుడు నరేశ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు.

ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో జరుగుతున్న వివాదాలకు నరేశ్‌ కారణమంటూ ఆరోపించాడు. ఆదివారం(అక్టోబర్‌ 10) ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సారి జరిగే ‘మా’ ఎన్నికలపై తాను స్పందించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అనంతరం నరేశ్‌ గురించి మాట్లాడుతూ.. ఇక గతేడాది నాగబాబు మద్దతు లేకపోయి ఉంటే నరేశ్‌ విజయం సాధించేవాడు కాదన్నాడు. అప్పుడు నాగాబాబు, నరేశ్‌కు ఎందుకు మద్దతు ఇచ్చాడో ఇప్పటికి తనకు అర్థం కావడం లేదన్నాడు.

చదవండి: విష్ణు ప్యానల్‌కే ఓటు వేయాలంటూ మోహన్‌ బాబు లేఖ

ఇక నరేశ్‌ ఆడే పాచికలాటలో ప్రాణ మిత్రులు కూడా విడిపోవాల్సి వచ్చిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఈ మేరకు శివాజీ రాజా ‘‘మా’ నరేశ్‌ చిన్నపిల్లాడు. ఎప్పుడు అబద్దాలే చెబుతాడు. అతడి నోటివెంట నిజాలు వచ్చిన రోజున నేను ఆశ్చపోతాను. గతంలో నాపై నరేశ్‌ ఎన్ని అసత్య ప్రచారం చేశాడు. నరేశ్‌ రాకతోనే ఆసోసియేషన్‌లో రాజకీయాలు మొదలయ్యాయి. నేను ‘మా’ అధ్యక్షుడిగా ఉన్పుడు అమెరికాలో ఫండ్‌ రైజింగ్‌ ఈవెంట్‌ నిర్వహించాము. అప్పుడు చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లతో కలిసి ఈ కార్యక్రమానికి హజరయ్యాము.

కానీ అదే సమయంలో ‘మా’కు జనరల్‌ సెక్రటరీగా ఉన్న నరేశ్‌ మాత్రం రాలేదు. అమెరికా రాకుండా ఇక్కడ సమావేశాలు పెట్టి నా గరించి తప్పుడు ప్రచారం చేశాడు’ అని ఆయన ఆరోపించారు. అలాగే ఈ అమెరికా పర్యటనకు విమాన టికెట్ట వ్యవహరంలో నేను, శ్రీకాంత్‌ డబ్బులు వాడుకున్నామని ఆరోపణలు చేశాడు. అయితే దీనిపై చిరంజీవి.. సినీ పెద్దలతో ఓ కమిటీ వేసి విచారణ జరిపి.. ఇందులో నిజం లేదని, నరేశ్‌ ఆరోపణలు అవాస్తవాలే అని తేల్చారన్నారు. శ్రీకాంత్‌, నేను డబ్బులు వాడుకోలేదని కూడా ఆ కమిటీ వెల్లడించిందని ఆయన చెప్పాడు. అయినా కూడా నరేశ్‌ ఇప్పటివరకూ మాకు క్షేమాపణలు చెప్పలేదన్నాడు. 

ఇక తన హాయాంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌ల ద్వారా వచ్చిన ఫండ్‌ని ఇప్పుడు ‘మా’ సంక్షేమం కోసం నరేశ్‌ వినియోగిస్తున్నాడని, అతని రాకతోనే అసోసియేషన్‌లో రాజకీయాలు ప్రారంభమయ్యాయన్నారు. ఇప్పుడు ‘మా’ ఎన్నికలు రచ్చకెక్కడానికి కూడా అతడే కారణమని, చిన్న విషయాలకు కూడా అబద్ధాలు ఆడతాడని పేర్కొన్నాడు. శ్రీకాంత్‌కు తనకు నరేశ్‌ క్షమాపణలు చెప్పేవరకు తనని ఇలాగే తిడుతూ ఉంటానని, అతడి వల్లే మా స్నేహ్నాలు కూడా చెడిపోయాయని ఆయన తెలిపారు. 

చదవండి: ‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

‘‘మా’ సభ్యుల కోసం ఓ వృద్ధాశ్రమం నిర్మించాలని నేను అనుకున్నాను. దానికి ఫండ్‌ రైజ్‌ చేయడం కోసం యూఎస్‌లో మరోసారి ప్రోగ్రామ్‌ పెట్టాలనుకున్నాను. దీనిపై పలువురు స్టార్‌ హీరోలతో చర్చించాను వారు కూడా ఒకే అన్నారు. అలాగే హీరో ప్రభాస్‌ను కూడా సంప్రదించాను. ప్రభాస్‌ షూటింగ్‌లో  భాగంగా ఈ ప్రోగ్రామ్‌కు రాలేనని, దీనిపై మీరంతగా శ్రమించకండన్నారు. తన వాటాగా ‘మా’ కోసం 2 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పాడు. ఆ మాట నాకెంతో తృప్తినిచ్చింది. ఇలా స్టార్‌హీరోహీరోయిన్స్ ప్రోగ్రామ్‌కి ఓకే అన్నాక.. నరేశ్‌ ప్రెస్‌మీట్ పెట్టి నాపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత వెంటనే ‘మా’ ఎన్నికలు జరిగాయి. మా ప్యానల్‌ ఓడిపోయింది. దాంతో ఆ ప్రోగ్రామ్‌ ఆగిపోయింది. నా కల అలాగే నిలిచిపోయింది’’ అంటూ ఆయన చెప్పకొచ్చాడు.

మరిన్ని వార్తలు