MAA Elections 2021: ‘మా’ గొడవ మాదే 

9 Oct, 2021 02:58 IST|Sakshi

దాదాపు నాలుగైదు నెలలుగా ఎక్కడ చూసినా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికల గురించి జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశాలివి. ‘మా గొడవ మాదే.. మేమంతా ఒక్కటే’ అంటూనే రాజకీయ ఎన్నికలను తలపించే రీతిలో ‘మా’ ఎన్నికల తీరు కనిపిస్తోంది. గత 28 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వివాదాలు, విమర్శలకు తోడు ఒకదశలో అభ్యంతరకర పదజాలంతో దూషణలూ వినిపించాయి. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అంశంపై ఓ రౌండప్‌..

లోకల్‌.. నాన్‌లోకల్‌..
‘సినిమా బిడ్డలం’ ప్యానల్‌ అంటూ ప్రకాశ్‌రాజ్, ‘మాకోసం మనమందరం’ అంటూ మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా రెండు పక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఘాటుగా సాగుతున్నాయి. మొదట్లో ‘‘ప్రకాష్‌రాజ్‌ నాన్‌లోకల్‌. షూటింగ్‌లకే సరిగా రాడు. ఇక ‘మా’ సమస్యలు పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది?’’ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే.. ‘‘మూడు దశాబ్దాలుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నాను. తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఎవరూ నన్ను నాన్‌ లోకల్‌ అనలేదు. ఇప్పుడు ఎందుకు నాన్‌ లోకల్‌ అవుతాను’’ అని ప్రకాశ్‌రాజ్‌ తన వాదన వినిపించుకున్నారు. ఆయనకు మద్దతుగా నాగబాబు మూడు రోజుల కింద ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే. ఆయన ఉంటే ‘మా’ అసోసియేషన్‌ బాగుపడుతుంది. మన తెలుగువాళ్లు వేరే భాషల్లో నటించడం లేదా?’’ అని పేర్కొన్నారు.

మరోవైపు.. ‘మీకు ఏ సమస్య వచ్చినా నేనిక్కడే ఉంటా..
ఈ ఊళ్లోనే ఉంటా’ అని మంచు విష్ణు ప్రకటించారు. ఆయన తండ్రి మోహన్‌బాబు కూడా.. ‘‘ఈ ఊళ్లోనే ఉండే నా కుమారుడు ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని నేను మాట ఇస్తున్నాను. మీ ఓటును మంచు విష్ణుకు, అతడి పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అని శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

మెగా వర్సెస్‌ మంచు!
మోహన్‌బాబు ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును నిలబెట్టాలనుకున్నప్పుడు చిరంజీవిని మద్దతు అడిగారని.. కానీ అప్పటికే ప్రకాశ్‌రాజ్‌కు సపోర్టు చేస్తానని మాటిచ్చానని చిరంజీవి చెప్పారనే వార్తలు వెలువడ్డాయి. దానిపై స్పందించిన మోహన్‌బాబు.. మెగాస్టార్‌ కుటుంబానికి చెందిన రామ్‌చరణ్, నాగబాబు వంటి వారు ఎన్నికల్లో నిలబడితే తాను మరో ఆలోచన లేకుండా మద్దతు తెలిపేవాడినని పేర్కొన్నారు. ఇలా ‘మా’ ఎన్నికలు ‘మెగా వర్సెస్‌ మంచు’లా మారాయి.

పోస్టల్‌ బ్యాలెట్‌ వర్సెస్‌ ఈవీఎం
తాము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్‌ చేశారన్న ఆరోపణలు వచ్చే అవకాశముందని, పేపర్‌ బ్యాలెట్‌ పెట్టాలని మంచు విష్ణు కోరగా.. ఎన్నికల అధికారి పేపర్‌ బ్యాలెట్‌ను ఆమోదించారు. అయితే విష్ణు 60 మంది సీనియర్‌ నటులతో తనకు అనుకూలంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేయించుకున్నారని ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

‘మా’ ఎప్పుడు మొదలైంది?
తెలుగు సినిమా నటీనటుల సంక్షేమం కోసం ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ని 1993లో ఏర్పాటు చేశారు. చిరంజీవి వ్యవస్థాపక అ«ధ్యక్షుడిగా, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్‌ వంటి వారు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. అసోసియేషన్‌ ప్రారంభంలో 150 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు దాదాపు 900 మందికిపైగా ఉన్నారు.

పెద్దదిక్కు ఎవరు?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువర్గాల సభ్యులు పరుషంగానే మాటల తూటాలు విసురుకున్నారు. ఈ సందర్భంలో చాలామంది ‘దాసరి నారాయణరావు’ను గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి సామరస్యంగా పరిష్కరించేవారని.. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడం వల్లే ఇంత రచ్చ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాగా.. సినిమా అంటే వినోదం అని.. ఇప్పుడు నటీనటులు ‘మా’ ఎన్నికల రూపంలో బయట వినోదం పంచుతున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇంతా చేసి ‘మా’ ఎన్నిక కాగానే మేమంతా ఒక్కటే అన్నట్టు కలసిపోతారని ఇండస్ట్రీ అంటున్న మాట. 

చదవండి: MAA Elections 2021: రెండు రోజుల్లో ఎన్నికలు.. ‘మా’కు సీవీఎల్‌ షాక్‌

మరిన్ని వార్తలు