Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ రివ్యూ

3 Nov, 2023 13:03 IST|Sakshi
Rating:  

టైటిల్‌: మా ఊరి పొలిమెర2
నటీనటులు: సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి, గెటప్‌ శ్రీను, సాహితి దాస‌రి తదితరులు
నిర్మాతలు: గౌరీ కృష్ణ
దర్శకత్వం: డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌
సంగీతం: జ్ఞాని
సినిమాటోగ్రఫీ: ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి
ఎడిటింగ్‌ :  శ్రీ వ‌ర‌
విడుదల తేది: నవంబర్‌ 3, 2023

రెండేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నేరుగా ఓటీటీలో రిలీజ్‌ అయినప్పటికీ.. ఊహించని విజయం సాధించడమే కాకుండా..సీక్వెల్‌పై ఆసక్తిని పెంచింది. అందుకే ‘మా ఊరి పొలిమేర 2’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్‌ 1కి వచ్చిన రెస్పాన్స్‌ చూసి ఈ సీక్వెల్‌ని థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యారు మేకర్స్‌. అందుకు తగ్గట్టే భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ని నిర్వహించారు. దానికి తోడు ఇటీవల రిలీజైన ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్‌ 3)థియేటర్స్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర 2’ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టింది? రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
‘మా ఊరి పొలిమెర’ మూవీ క్లైమాక్స్‌లో కొమురయ్య అలియాస్‌ కొమిరి(సత్యం రాజేశ్‌) బతికి ఉన్నట్లు చూపించారు. అంతేకాదు అతను చేతబడి చేసి చంపిన గర్భవతి కవిత(రమ్య) కూడా బతికున్నట్లు, కొమిరితో కలిసి వెళ్లినట్లు చూపిస్తూ ముగించారు. అక్కడ నుంచి పార్ట్‌ 2 కథ ప్రారంభం అవుతుంది. చేతబడి చేస్తూ ఊరి సర్పంచ్‌, అతని కూతురు చావులను కారణమైన కొమురయ్యను పట్టుకునేందుకు వెళ్లిన అతని తమ్ముడు, కానిస్టేబుల్‌ జంగయ్య(బాలాదిత్య) కనిపించకుండా పోతాడు.

జంగయ్య మిస్సింగ్‌ కేసు కొత్తగా వచ్చిన ఎస్సై(రాకేందు మౌళి) చేతికి వెళ్తుంది. అతను కొమురయ్య భార్య లక్ష్మీ(కామాక్షి భాస్కర్ల), స్నేహితుడు బలిజ(గెటప్‌ శ్రీను)లను అనుమానిస్తాడు. ఓ సారి శబరి వెళ్లిన బలిజకు కొమిరి కనిపిస్తాడు. అతన్ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తాడు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని బలిజకు వివరిస్తాడు కొమురయ్య. అసలు కొమురయ్య ఎందుకు కేరళ వెళ్లాడు? చనిపోయిన రమ్య మళ్లీ ఎలా బతికొచ్చింది? బలిజ భార్య రాముల(సాహితి దాసరి) ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది? ఆ ఊరిలో ఉన్న గుడి వందేళ్ల కిత్రం ఎందుకు మూసేశారు? ఆ గుడికి కొమిరి చేతబడులకు ఉన్న సంబంధం ఏంటి?  అన్న కోసం వెళ్లిన జంగయ్య ఎలా మిస్‌ అయ్యాడు? భర్త కొమురయ్య గురించి లక్ష్మీ తెలుసుకున్న నిజాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే.. థియేటర్స్‌లో ‘మా ఊరి పొలిమేర 2’చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
మ‌ర్డ‌ర్ మిస్ట‌రీకి బ్లాక్ మ్యాజిక్(చేతబడి) అంశాన్ని జోడించి తెరకెక్కించిన ‘మా ఊరి పొలిమేర’ అందరిని భయపెట్టింది. ఆ చిత్రానికి సీక్వెల్‌ అంటే.. అంతకు మించిన ట్విస్టులు, భయపెట్టే సీన్స్‌​ ఉంటాయని అంత భావించారు. కానీ అలాంటి అంచనాలతో వెళ్లిన ఆడియన్స్‌ని ‘మా ఊరి పొలిమేర 2’ అంతగా ఆకట్టుకోదు. మొదటి భాగానికి వచ్చిన హైప్‌ వల్ల దర్శకుడిపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించింది. ఆడియన్స్‌కి ఊహించని ట్విస్టులు ఇవ్వాలనుకొని కథ, కథనంపై ఎక్కువ ఫోకస్‌ పెట్టలేదు.

చేతబడి సీన్స్‌ బాగున్నప్పటికీ.. పార్ట్‌ 1లోలాగా కన్విన్సింగ్‌గా అనిపించవు. పైగా కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలనుకొనే..టిస్టులను రాసుకున్నాడు కానీ అవి కథకు ఏ మేరకు అవసరమనేది పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ని చూపించడం కారణంగా..ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఏర్పడుతుంది. అయితే పార్ట్‌ 1 చూడకపోయినా.. పార్ట్‌ 2 చూసే విధంగా కథను తీర్చి దిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే. 

పార్ట్‌ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్‌ 2ని ప్రారంభించాడు. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి.. కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్‌ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది.

 కొమురయ్య, బలిజ కలిశాక వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ కథపై ఆసక్తిని పెంచుతాయి. అసలు కవిత ఎలా బతికొచ్చింది? ఎందుకు చేతబడి చేయాల్సి వచ్చింది?  అతని కలలోకి ఊర్లో ఉన్న గుడి రహస్యాలు ఎందుకు వస్తున్నాయి?  అనే సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించాడు. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టుల మాత్రం ఊహించని విధంగా ఉంటాయి.

గుడిలో కొమురయ్య చేసే పూజకు సంబంధించిన సీన్‌ భయపెడుతుంది.  పార్ట్‌ వన్‌లో మర్డర్‌ మిస్టరికీ చేతబడిని యాడ్‌ చేస్తే.. ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. దీంతో కథ కాస్త ‘కార్తికేయ’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. పార్ట్‌ 1లో లాగే పార్ట్‌ 2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి.. వాటిని సమాధానం పార్ట్‌ 3లో ఉంటుందని ముగించేశాడు. 

ఎవరెలా చేశారంటే..
కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్‌ ఒదిగిపోయాడు. పార్ట్‌ 1లో నటించిన అనుభవం ఉంది కాబట్టి.. ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్‌ప్రెషన్స్‌ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల  చక్కగా నటించింది. పార్ట్‌ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్‌ అదిరిపోతుంది.

ఇక జంగయ్యగా  నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేర నటించాడు. అయితే పార్ట్‌ 1తో పోలిస్తే.. ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువ.  బలిజ పాత్రలో గెటప్‌ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.  ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది.  ఎడిటర్‌ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు