Vishal: నటుడు విశాల్‌కు షాకిచ్చిన మద్రాస్‌ హైకోర్ట్‌

28 Aug, 2022 14:54 IST|Sakshi

నటుడు విశాల్‌ను తన ఆస్తుల వివరాలను  సమర్పించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న విశాల్‌ ఫైనాన్షియర్‌ అన్బుచెలియన్‌కు చెందిన గోపురం ఫిలిమ్స్‌ సంస్థ నుంచి రూ.21.29 కోట్లు రుణం తీసుకున్నాడు. తర్వాత ఆ మొత్తాన్ని లైకా ప్రొడక్షన్స్‌ చెల్లించే విధంగా విశాల్‌ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో లైకా సంస్థ తిరిగి చెల్లించే వరకు విశాల్‌కు చెందిన అన్ని చిత్రాల హక్కులను తమ సంస్థకు రాసిచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే విశాల్‌ ఆ సంస్థకు అప్పు చెల్లించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్‌ హైకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేసింది. అందులో విశాల్‌ తమ అప్పు రూ. 21.29 కోట్లు చెల్లించకుండా ఒప్పందాన్ని అతిక్రమించి చిత్రాన్ని ఇతర సంస్థకు విక్రయించారని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఆ చిత్ర తమిళ శాటిలైట్, ఇతర భాషల శాటిలైట్, ఓటీటీ హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు విశాల్‌కు రూ.15 కోట్లను ఏదైనా జాతీయ బ్యాంకు ప్రధాన నిర్వాహకుడి వద్ద డిపాజిట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఈ కేసుపై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. నటుడు విశాల్‌ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించినట్లుగా డబ్బులు బ్యాంకులో డిపాజిట్‌ చేయకపోవడానికి కారణం ఏమిటని విశాల్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు విశాల్‌ బదులిస్తూ తాను ఒకే రోజున రూ.18 కోట్లు నష్టపోయానని దీంతో దానికి వడ్డీ చెల్లిస్తూ వస్తున్నానని తెలిపారు. దీంతో కేసు ముగుస్తుందని భావిస్తున్నారా..? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం విశాల్‌ ఆస్తుల వివరాలను న్యాయస్థానంలో సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెపె్టంబర్‌ 9వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఆరోజు విశాల్‌ కోర్టుకు హాజరుకావాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.

చదవండి: (Dhanush: తమ్ముడికి అన్నయ్యే విలన్‌ అయ్యాడు)

మరిన్ని వార్తలు