Vishal : ఆస్తుల వివరాలు సమర్పించాలని విశాల్‌కు కోర్టు ఆదేశాలు

10 Sep, 2022 09:44 IST|Sakshi

తమిళసినిమా: లైకా ప్రొడక్షన్స్‌కు అప్పు చెల్లింపుల కేసులో నటుడు విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు మరింత గడువు ఇస్తూ సరైన పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. వివరాలు.. విశాల్‌ తమకు రూ.21.29 కోట్లు అప్పు చెల్లించాల్సి ఉందంటూ లైకా ప్రొడక్షన్స్‌ చెన్నై హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా విశాల్‌కు సమన్లు జారీ చేసింది.

దీంతో ఇటీవల కోర్టుకు హాజరైన విశాల్‌ తన చిత్ర నిర్మాణ సంస్థ ఒకే రోజు రూ.18 కోట్లు నష్టపోవడంతో లైకా సంస్థకు అప్పు చెల్లించలేకపోయానని తెలిపారు. అయితే తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలన్న ఉద్దేశ్యం లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి, సెప్టెంబర్‌ 9 లోపు ఆస్తుల వివరాలను వెల్లడించాలని విశాల్‌ను ఆదేశించారు.

ఈ కేసు విచారణ శుక్రవారం మరోసారి న్యాయమూర్తి ఎం.సుందర్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. విశాల్‌ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాది హాజరై ప్రమాణ పత్రం కోర్టులో సమర్పించడానికి మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి మరో రెండు వారాలు గడువు ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు