Dhanush Paternity Case: ధనుష్‌కు మద్రాస్‌ హైకోర్టు షాక్‌.. సమన్లు జారీ

3 May, 2022 20:27 IST|Sakshi

తమిళ స్టార్‌ ధనుష్‌కు మద్రాస్‌ హైకోర్టు షాకిచ్చింది. ధనుష్‌ తమ కొడుకేనంటూ ఓ వృద్ధ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ధనుష్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా ధనుష్‌ తమ కొడుకేనంటూ కతిసేరన్‌, మీనాక్షి అనే దంపతులు 2016లో మదురై జిల్లాలోని మేలూర్‌లోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  కొన్ని ఏళ్లుగా కోర్టులో కేసు పెండింగ్‌లోనే ఉంది. ధనుష్‌ సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రాలు ఫేక్‌ అని ఆరోపిస్తూ కేసు వేశారు. ధనుష్‌ తమ మూడో కొడుకని, సినిమాల్లో నటించేందుకు చిన్నతనంలోనే ఇంటినుంచి పారిపోయి చెన్నై వచ్చాడని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ధనుష్‌ అసలైన తల్లిదండ్రులమని, అతని నుంచి రూ. 65 వేలు పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. ఇందుకు సదరు దంపతులు ధనుష్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి మెమో, ఫిజికల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్‌ను కూడా సమర్పించారు. దీంతో కేసును పరిష్కరించేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలని కోర్టు సూచించగా.. ధనుష్‌, అతని తరపు న్యాయవాది ఈ అభ్యర్థనను తిరస్కరించారు. అయితే ఐడెంటిఫికేషన్‌ ప్రూఫ్స్‌ సరిపోతాయో లేదో చెక్‌ చేసేందుకు ధనుష్‌కు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ వైద్య పరీక్షల ఫలితాలు ధనుష్‌కు అనుకూలంగా రావడంతో దంపతుల ఆరోపణలు రుజువు చేసేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని 2020లో కోర్టు ఈ కేసును కొట్టి వేసింది.


చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్‌ చేస్తున్న నెటిజన్లు

కాగా జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌లో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్‌ చేస్తూ కతిసేరన్‌ దంపతులు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు ధనుష్‌ అందించిన ఆధారాలపై పోలీసులతో విచారణ జరిపించాలని కోరారు. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలంటూ ధనుష్‌కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ధనుష్ కొట్టిపారేశాడు. తాను తమిళ నిర్మాత కస్తూరి రాజా, విజయలక్ష్మిల కుమారుడినంటూ పేర్కొన్నారు. తన నుంచి డబ్బులు రాబట్టే ఉద్ధ్యేశంతో తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నాడు.
చదవండి: Pooja Bhatt: నాన్నను బాత్రూమ్‌లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్‌ ఏడ్చేశా: నటి

మరిన్ని వార్తలు