Maestro Review: అంధుడిగా నితిన్‌ నటన ఎలా ఉందంటే..?

17 Sep, 2021 17:23 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : మ్యాస్ట్రో
నటీనటులు :నితిన్, తమన్నా భాటియా, నభా నటేష్, జిషు సేన్ గుప్తా, నరేష్, శ్రీముఖి, అనన్య, హర్షవర్ధన్, రచ్చ రవి, మంగ్లీ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రేష్ట్ మూవీస్
నిర్మాతలు : సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి
దర్శకత్వం: మేర్లపాక గాంధీ
సంగీతం : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ : వై యువరాజ్
ఎడిటింగ్‌: ఎస్ఆర్ శేఖర్
విడుదల తేది : సెప్టెంబర్‌ 17, 2021(డిస్నీ+హాట్‌స్టార్‌)

భీష్మ సూపర్ హిట్ కావడంతో అదే జోష్‌తో వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్‌ హీరో నితిన్‌. కాని భీష్మ రేంజ్‌ హిట్‌ని మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఆయన ఇటీవల చేసిన చెక్‌, రంగ్‌ దే మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ సారి ఎలాగైన హిట్‌ కొట్టాలని మాస్ట్రో లుక్‌లోకి మారాడు నితిన్‌. బాలీవుడ్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ అంధాధున్‌కు తెలుగు రీమేక్‌. ఈ మూవీ శుక్రవారం(సెప్టెంబర్‌ 17)న ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తొలిసారి నితిన్‌ అంధుడి పాత్ర పోషించడంతో మ్యాస్ట్రోపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలు ‘మ్యాస్ట్రో’ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
చూపు ఉన్న అంధుడిగా నటిస్తాడు అరుణ్‌(నితిన్‌). అతనిలో ఉన్న గొప్ప టాలెండ్‌ ఏంటంటే పియానో చక్కగా వాయించడం. ఒకసారి తన పియానో పాడవడంతో కొత్తది కొనాలని చూస్తాడు. ఈ క్రమంలో పెడ్రో అనే రెస్టారెంట్‌లో పియానో అమ్మకానికి పెట్టినట్లు తెలుసుకొని,చూసేందుకు వెళ్తాడు. అక్కడ తన మ్యూజిక్‌ ప్రతిభ చూపించి అందరి మన్ననలు పొందుతాడు. అరుణ్‌ టాలెంట్‌ నచ్చి అతనితో ప్రేమలో పడిపోతుంది రెస్టారెంట్‌ ఓనర్‌ కూతురు సోఫీ(నభా నటేశ్‌). ఆ రెస్టారెంట్‌కు తరచు వచ్చే సినీ హీరో మోహన్‌ (వీకే నరేష్).. అరుణ్‌ పియానో సంగీతానికి ఫిదా అవుతాడు. తన  భార్య సిమ్రన్ (తమన్నా భాటియా) బర్త్‌డే సందర్భంగా ప్రైవేట్ కన్సర్ట్‌‌ను ఏర్పాటు చేయాలని అరుణ్‌ను తన ఇంటికి పిలుస్తాడు. అరుణ్‌ మోహన్‌ ఇంటికి వెళ్లేసరికి అతను హత్యకు గురవుతాడు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు? ఈ హత్యకు సిమ్రాన్‌, సీఐ బాబీ ( జిషు సేన్‌ గుప్తా)లకు సంబంధం ఏంటి? అరుణ్‌ అంధుడిగా ఎందుకు నటించాలనుకున్నాడు? మోహన్‌ హత్యతో అరుణ్‌ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేది తెలియాలంటే డిస్నీ+హాట్‌స్టార్‌లో సినిమా చూడాల్సిందే. 

ఎవరెలా చేశారంటే.. 
నితిన్‌ తొలిసారి అంధుడిగా నటించిన సినిమా ఇది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్‌ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో నితిన్‌ చేశాడు. ఆయుష్మాన్‌కు సమానంగా అంధుడి పాత్రలో నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నవ్వించిన నితిన్‌.. సెకండాఫ్‌లో భావోద్వేగాలపరంగా చక్కటి హావభావాలు పలికించాడు. అంధుడు అరుణ్‌ పాత్రకు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాడు. ఇక ఈ సినిమాలో నితిన్‌ తర్వాత బాగా పండిన పాత్ర తమన్నాది. సిమ్రన్‌ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసింది. హిందీలో టబు పోషించిన పాత్ర అది. విలన్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనదైన నటన కనబరిచింది. సోఫి పాత్రలో ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేశ్‌ మెప్పించింది.  జిషు సేన్‌ గుప్త, నభా నటేశ్‌, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఎలా ఉందంటే.. 
హిందీలో వచ్చి, సూపర్‌ హిట్‌ అయినా ‘అంధాధున్‌’ మూవీకి తెలుగు రీమేకే‘మ్యాస్ట్రో’.సాధారణంగా రీమేక్‌ అనగానే మాతృకతో పోల్చి చూస్తారు. అందులో ఉన్నది.. ఇందులో లేనిది ఏంటని నిశితంగా పరిశీలిస్తారు.  ఉన్నది ఉన్నట్లు తీస్తే కాపీ అంటారు. ఏదైనా యాడ్‌ చేస్తే.. అనవసరంగా యాడ్‌ చేసి మంచి సినిమాను చెడగొట్టారని చెబుతారు. అందుకే రీమేక్‌ అనేది దర్శకుడికి కత్తిమీద సాము లాంటిదనే చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విజయవంతం అయ్యాడు. మాతృకలోని ఆత్మను ఏమాత్రం చెడకుండా ‘అంధాదున్‌’ని తెలుగు ప్రేక్షకులు మ్యాస్ట్రోగా అందించాడు. ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే లాంటి దిగ్గజ నటులు సెట్‌ చేసిన టార్గెట్‌ని వందశాతం అందుకోలేకపోయినా.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో అంధుడిగా నితిన్‌ చేసే సరదా సీన్స్‌ ప్రేక్షకులను నవ్విస్తాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సీఐ బాబీ అరుణ్‌ణి చంపాలనుకోవడం.. దాని నుంచి అరుణ్‌ తప్పించుకొని గోవాకు వెళ్లేందుకు ప్రయత్నించే సీన్స్‌ ఆసక్తిని కలిగిస్తాయి. సెకండాఫ్‌లో అరుణ్‌, సిమ‍్రన్‌ మధ్యల వచ్చే కొన్ని సీన్స్‌ నెమ్మదిగా సాగడం సినిమాకు కాస్త మైనస్‌. ఇక క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. అంధాదున్‌ సినిమా చూడకుండా డెరెక్ట్‌గా మాస్ట్రో చూసేవారిని థ్రిల్లింగ్‌ మూవీ చూశామనే అనుభూతి కలుగుతుంది. మహతి స్వర సాగర్ బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా  బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయింది.  వై యువరాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు