Mahesh Babu-Namrata Love Story: మొదట ప్రపోజ్‌ చేసింది ఎవరంటే..

9 Aug, 2022 08:26 IST|Sakshi

సాక్షి, వెబ్ డెస్క్:  వెండితెరపై హీరో, హీరోయిన్లుగా నటించి నిజ జీవితంలో పెళ్లిబంధంతో ఒక్కటైన జంటల్లో మహేశ్‌బాబు-నమ్రత కూడా ఒకరు. టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌గా వీరికి పేరుంది. వీరిద్దరిని కలిపింది వంశీ సినిమానే. 2000లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్‌ఫీస్‌ వద్ద అంతగా మెప్పింపలేకపోయింది. కానీ వీరి ప్రేమకు మజిలీగా మారింది. వంశీ షూటింగ్‌ సమయంలోనే నమ్రత-మహేశ్‌ ప్రేమలో పడ్డారు. ఓసారి ఈ సినిమా అవుట్‌డోర్‌ షూటింగ్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ న్యూజిలాండ్‌ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్‌ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది.

నమ్రత మహేశ్‌ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్‌ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది.  న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. కానీ వీరి ప్రేమను మహేష్‌ తొలుత కుటుంబం అంగీకరించలేదట. దీంతో మహేశ్‌ తన సోదరి మంజుల సహాయం తీసుకున్నారట.

అలా నమ్రత-మహేశ్‌ల పెళ్లి జరగడంలో మంజుల కీలక పాత్ర పోషించిందట. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. అంతేకాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి వరకు కూడా షూటింగ్‌లో పాల్గొని ముంబై వెళ్లి పెళ్లి చేసుకున్నారు మహేశ్‌. 

ఇక పెళ్లి తర్వాత మహేశ్‌ కెరీర్‌ మరింత స్పీడ్‌ అందుకుంది. సినిమా ప్రమోషన్స్‌ నుంచి కాస్ట్యూమ్స్‌ వరకు అన్నీ నమ్రతే దగ్గరుండి చూసుకుంటుందని మహేశ్‌ ఓ సందర్భంగా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు చాలా తొందరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్‌-నమ్రతల రిలేషన్‌ మాత్రం ఎక్కడా బయటపడకపోవడం విశేషం.

ఇక పెళ్లి అనంతరం నమ్రత సినిమాలకు గుడ్‌ బై చెప్పేసింది. బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే యాక్టింగ్‌ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. 'టాప్‌ హీరోయిన్‌ అవ్వాలన్న కోరిక ఎప్పుడూ లేదు. మహేశ్‌ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడే సినిమాలను వదులుకోవాలనుకున్నా.

పెళ్లయి ఇన్నేళ్లయినా ఒక్కసారి కూడా ఈ విషయంలో రిగ్రేట్‌గా అనిపించలేదు. మహేశ్‌ కుటుంబం కోసం ఏదైనా చేస్తారు. ఎంత బిజిగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. వీటన్నింటికీ మించి గొప్ప మానవతా వాది. అందుకే మహేశ్‌ అంటే నాకు ఎంతో ప్రేమ, ఆరాధన. ఆయన్ను పెళ్లిచేసుకోవడం నాకు లభించిన అత్యంత ప్రత్యేకమైన బహుమతిగా ఫీల్‌ అవుతుంటా' అని నమ్రత పేర్కొంది. 

మరిన్ని వార్తలు