ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి

9 Aug, 2020 05:46 IST|Sakshi

‘‘కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. కాబట్టి ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అని హీరో మహేశ్‌ బాబు పిలుపునిచ్చారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన అభిమానులకు, ప్రజలకు  ప్లాస్మా దానం చేయాలని ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారాయన.

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌గారు ప్లాస్మా డొనేషన్‌ ప్రాముఖ్యత గురించి ప్రజలందరికీ తెలియజేయడానికి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. ఆయన కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన తెచ్చుకుని  ముందుకొచ్చి ప్లాస్మా దానం చేసినవారందర్నీ అభినందిస్తున్నాను.

సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడడానికి దోహదపడే ప్లాస్మాను డొనేట్‌ చేయమని రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ముఖ్యంగా నా బర్త్‌డే సందర్భంగా అభిమానులందరూ ప్లాస్మా డొనేషన్‌ ఎవేర్నెస్‌ ప్రోగ్రామ్స్‌ ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా డొనేట్‌ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్లాస్మా డొనేషన్‌ ఎవేర్నెస్‌ ప్రోగ్రామ్‌ను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చాలా సమర్థవంతంగా నిర్వహిస్తోంది. మొత్తం పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కి అభినందనలు’’ అని ఆ ప్రకటనలో మహేశ్‌ బాబు పేర్కొన్నారు.
 

నో ప్లాన్‌... మహేశ్‌ బాబు బర్త్‌డేకి మీరేమైనా ప్రత్యేకంగా ప్లాన్‌ చేశారా? అని ఆయన సతీమణి నమ్రతను అడిగితే –‘‘ఏమీ ప్లాన్‌ చేయలేదు. ఇంట్లోనే ఉంటాం. మహేశ్‌కి నచ్చిన వంటకాలతో కుటుంబమంతా కలిసి లంచ్‌ చేస్తాం. ఆ తర్వాత సినిమాలు చూస్తాం. ఇదే బర్త్‌డే స్పెషల్‌’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా