Jamuna Death: తెలుగువారి సత్యభామ మరణం ఎంతో విచారకరం.. సెలబ్రిటీల సంతాపం

27 Jan, 2023 11:02 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికగా వెలుగు వెలిగిన తార జమున. స్టార్‌ హీరోలతో జత కట్టి తెలుగు తెరకు బోలెడు హిట్స్‌ అందించిన ఆమె లేడీ ఓరియంటెడ్‌ సినిమాలతోనూ కలెక్షన్లు కురిపించారు. సినీపుస్తకంలో తనకంటూ ప్రత్యేక పాఠం లిఖించుకున్న జమున శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో అటు సినీఇండస్ట్రీ, ఇటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్‌ మీడియా వేదికగా సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు.

సీనియర్ హీరోయిన్ జమున స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం
- చిరంజీవి

అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి  నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.
-నందమూరి బాలకృష్ణ

దాదాపు 30 సంవత్సరాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో మహారాణిలా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి
- జూనియర్‌ ఎన్టీఆర్‌

సుప్రసిద్ధ బహుభాషా నటీమణి, లోక్ సభ మాజీ సభ్యురాలు జమున మరణం చిత్ర పరిశ్రమ​కు తీరని లోటు. ఆమె మరణ వార్త తెలిసి ఎంతో చింతించాను. వెండి తెరపై సత్యభామ అంటే జమున గారు అనేలా గుర్తుండిపోయారు. ఎన్నో పౌరాణిక పాత్రలకు జీవం పోశారు. ప్రేక్షకలోకంలో స్థిర కీర్తిని సముపార్జించుకున్నారు. లోక్ సభ సభ్యురాలిగా ప్రజలకు ఎన్నో సేవలందించారు. కళాపీఠం తరఫున ఆమెను సమున్నతంగా సత్కరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
- డా. టి. సుబ్బరామిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు

జమున తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా 1989లో రాజమండ్రి ఎంపీగా ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్థున్నాను
- అనిల్ కుర్మాచ‌లం, తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్

చదవండి: లావైపోయింది అని సత్యభామగా వద్దన్నారు

మరిన్ని వార్తలు