'దారే లేదా' సాంగ్‌పై మహేశ్‌బాబు ప్రశంసలు

20 Jun, 2021 12:59 IST|Sakshi

కరోనా మహమ్మారి వల్ల ప్రజలు కాలు బయటపెట్టడానికే జంకుతున్నారు. ముచ్చట్లు, పార్టీలు పక్కనపెట్టి ఇంటికే పరిమితమయ్యారు. అత్యవసరమైతేనే గడప దాటి అడుగేస్తున్నారు. కానీ ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ మాత్రం పది మంది ప్రాణాలు కాపాడటం కోసం వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అటు కుటుంబ బాధ్యతలను మోస్తూనే ఇటు వృత్తిలోనూ భాగమవుతున్నారు. కోవిడ్‌ కష్టకాలంలో ప్రజల జీవితాలను కాపాడిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు అంకితమిస్తూ నాని 'దారే లేదా' పాటను రిలీజ్‌ చేశాడు. సత్యదేవ్‌, రూపా కొడువాయూర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌పై రూపొందించిన ఈ పాటలో వైద్యుల వ్యక్తిగత జీవితం, కుటుంబంతో వాళ్లు గడిపే సమయం, పేషెంట్లకు అందించే సేవ, అన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు. కోవిడ్‌ కాలంలో వారికి హాస్పిటలే ఇళ్లుగా మారిన వైనాన్ని తెలియజెప్పారు. ప్రతి ఒక్కరి మనసు కదిలిస్తున్న ఈ 'దారే లేదా' సాంగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా దీనిపై సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు స్పందించాడు. "కోవిడ్‌ కష్టసమయంలో ఎంతగానో కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లను గౌరవించేందుకు మంచి దారి ఎన్నుకున్నారు. ఈ వీడియో చూసి నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. నాని, అతడి టీమ్‌ అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించారు" అని ట్వీట్‌ చేశాడు. ఈ మేరకు ఆ పాట వీడియో లింక్‌ను కూడా షేర్‌ చేశాడు.

చదవండి: Meet Cute Movie: ఐదుగురు హీరోయిన్లలో అదాశర్మ ఒకరు!

మరిన్ని వార్తలు