మహేష్‌ ‘ఒక్కడు’గా వచ్చి 18 ఏళ్లు

15 Jan, 2021 13:55 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా విడుదలై నేటికి 18 సంవత్సరాలు పూర్తవుతోంది. మహేష్ బాబు, భూమిక చావ్లా ప్రధాన పాత్రలో 2003 జనవరి 15న విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నింటినీ మించిన బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. ప్రకాష్‌ రాజ్‌ పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో నటించాడు. అప్పటివరకూ మహేష్ బాబు కెరీర్‌లో రాజకుమారుడు, మురారి లాంటి హిట్లు వచ్చినా మొదటి బ్లాక్ బస్టర్ హిట్‌గా ఒక్కడు నిలిచింది. ఈ సినిమా వచ్చి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మహేష్‌ సతీమణి నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టా‍గ్రామ్‌ ద్వారా స్పందించారు. మహేష్‌ నటించిన సినిమాల్లో ఒక్కడు క్లాసిక్‌ హిట్‌ అని, ఎక్కువ సార్లు చూసే చిత్రమని కొనియాడారు. అంతేగాక తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అని పేర్కొన్నారు. చదవండి: సుకుమార్‌-మహేష్‌ కాంబినేషన్‌లో మరో సినిమా?

ఇక సినిమాలో కబడ్డీ ఆటగాడిగా మహేష్‌ కనిపించాడు. అప్పటి వరకు ఎప్పుడూ కబడ్డీ ఆడని మహేష్‌ ఈ సినిమా కోసం కొన్ని రోజులు కబడ్డీ నేర్చుకొని ఆ పాత్ర పోషించాడు. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన చార్మినార్ సెట్ కోసం హైదరాబాదు శివార్లలోని గోపన్నపల్లె గ్రామంలో నిర్మాత రామానాయుడికి ఉన్న ఓ పదెకరాల ఖాళీస్థలాన్ని వాడారు. ఈ సెట్‌ నిర్మాణానికి రూ.కోటి డెబ్భై లక్షలు ఖర్చయింది. ఈ సినిమాకు ముందుగా ‘అతడే ఆమె సైన్యం’ అనే టైటిల్‌ను అనుకున్నారు కానీ అప్పటికే ఈ పేరుతో ఎవరో ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నారు. దాంతో టైటిల్‌ను ఒక్కడుగా మార్చారు. ఈ సినిమా తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్‌గా విడుదలైంది. తమిళంలో విజయ్, త్రిష జంటగా గిల్లి పేరుతో రీమేక్ చేసారు. అక్కడ ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇదే సినిమాను కన్నడంలోకి పునీత్ రాజ్ కపూర్, అనురాధా మెహతా జంటగా అజయ్ పేరిట రీమేక్ చేయగా ఇది అంతగా విజయవంతం కాలేదు. చదవండి: ‘సర్కారు వారి పాట’పై స్పందించిన రేణు దేశాయ్‌

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

>
మరిన్ని వార్తలు