Sai Dharam Tej Accident: సాయి తేజ్‌కు ప్రమాదం ఎలా జరిగిందో వివరించిన ఎన్టీఆర్‌ పీఆర్‌ఓ

13 Sep, 2021 14:47 IST|Sakshi
సాయిధరమ్‌ తేజ్‌ (ఫైల్‌ ఫొటో)

అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు. శుక్రవారం(సెప్టెంబర్‌ 10)న ఆయనకు రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఇప్పటికి ఈ విషయంపైన చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం తేజ్‌ అతివేగమే కారణమంటూ పలువురు కామెంట్స్‌ చేయగా, రోడ్డుపై ఉన్న ఇసుక వల్ల సాయి తేజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ స్కిడ్‌ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విషయమై చాలా మంది మిడి మిడి జ్ఞానంతో ఏవేవో కామెంట్స్‌ చేస్తున్నారంటూ ఎన్టీఆర్ పీఆర్ఓ మ‌హేష్ కోనేరు సోషల్‌ మీడియాలో మండిపడ్డారు.

తేజ్‌కు ప్రమాదం ఎలా జరిగి ఉండొచ్చో వివరిస్తూ దానికి సంబంధించిన యాక్సిడెంట్‌ వీడియోని మహేష్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘పెద్ద వాహనాల గురించి తెలియని చాలామంది సాయిధరమ్‌ తేజ్‌కు జరిగిన ప్రమాదంపై మిడి మిడి జ్ఞానంతో కామెంట్స్‌ చేస్తున్నారు. అతను అతి వేగంగా, బాధ్యత రాహిత్యంతో డ్రైవింగ్‌ చేసే వ్య‌క్తి కాడు. రోడ్డుపై మ‌ట్టి, ఇసుక ఉండ‌డం వ‌ల్ల ముందు వెళుతున్న వాహ‌నాలు స్లో అయ్యాయి. సాయి నెమ్మదించి పక్కనుంచి వెళ్లాలనుకున్నాడు. అయితే అక్కడ ఇసుక ఉండడంతో జారి పడిపోయాడు. ఎంతో అనుభవం ఉన్న రేసర్‌కైనా సాధారణంగా ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

రోడ్డు సరిగ్గా లేనందున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంతేకానీ సాయి ఓవర్‌ స్పీడ్‌ వల్లకాదు. అతను ఎటువంటి నియ‌మాల‌ను అతిక్ర‌మించ‌లేదు, ఆ టైమ్‌లో సాయి తేజ్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. యాక్సిడెంట్‌ అనేది ఎవరికైనా జరగొచ్చు. కాబట్టి అతడికి, అతడి కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి.  అన్ని ప్రమాదాలు అతివేగం వల్ల మాత్రమే జరగవు’ అని మహేశ్ కోనేరు వీడియో పోస్టు క్యాప్షన్‌లో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు