మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు

12 Aug, 2020 16:56 IST|Sakshi

మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో ఇన్‌సైడర్‌, ఔట్‌సైడర్‌ చర్చ విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి మహిమా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బయటి వ్యక్తిని కావడంతో ఇండస్ట్రీలో పలు అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ‘పర్దేస్‌’ డైరెక్టర్‌ సుభాష్‌ ఘయ్‌ తనను తిట్టారని.. కోర్టుకు లాగుతానని బెదిరించారని తెలిపారు. ఆ సమయంలో సంజయ్‌ దత్‌, సల్మాన్‌ ఖాన్‌లు తనకు మద్దతుగా నిలిచారని తెలిపారు. 

మహిమా చౌదరి మాట్లాడుతూ.. ‘సుభాష్‌ ఘయ్‌ నన్ను విపరీతంగా తిట్టారు. కోర్టుకు లాగాలని ప్రయత్నించారు. నా ఫస్ట్‌ షోని రద్దు‌ చేయించాలని చూశారు. నాతో పని చేయవద్దని మిగతా నిర్మాతలకు సందేశాలు పంపారు. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి చెందిన నలుగురు వ్యక్తులు మాత్రమే నాకు మద్దతుగా నిలిచారు. వారు సల్మాన్‌ ఖాన్, సంజయ్ దత్, డేవిడ్ ధావన్, రాజ్‌కుమార్ సంతోషి. వీరు మాత్రమే నాకు మద్దతుగా నిలిచారు. డేవిడ్‌ ధావన్‌ నన్ను పిలిచి బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఆయన నిన్ను వేధించకుండా చూస్తాము అని ధైర్యం చెప్పారు. వీరు తప్ప మిగతా ఎవ్వరు నాకు ఫోన్‌ చేయలేదు’ అన్నారు మహిమా చౌదరి. కానీ తాను కొన్ని మంచి అవకాశాలను కోల్పోయినట్లు తెలిపారు. వాటిలో 1998లో వచ్చిన రాంగోపాల్‌ వర్మ ‘సత్య’ చిత్రం కూడా ఉందన్నారు మహిమా చౌదరి. ('సంజయ్‌.. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసు')

ఈ చిత్రం కోసం మొదట తననే తీసుకున్నారని.. తర్వాత తన స్థానంలో ఉర్మిళా మండోద్కర్‌ను పెట్టారని తెలిపారు మహిమా చౌదరి. ఇది తాను సంతకం చేసిన రెండవ చిత్రం అన్నారు. అయితే ఈ చిత్రం నుంచి తనను తొలగిస్తున్నట్లు రాంగోపాల్‌ వర్మ ఎలాంటి సమాచారం ఇ‍వ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితులన్ని తాను బయటి వ్యక్తిని కావడం వల్లనే ఎదురయ్యాయని.. పరిశ్రమకు చెందిన వ్యక్తి అయితే ఇన్ని కష్టాలు ఉండేవి కాదన్నారు. ఏది ఏమైనా ధైర్యంగా నిలిచి పోరాడాలని తెలిపారు. మహిమా చౌదరి 1997లో వచ్చిన పర్దేస్‌ చిత్రంతో పరిశ్రమలో అడుగు పెట్టారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా