Major Movie Review In Telugu: మేజర్‌ మూవీ రివ్యూ

3 Jun, 2022 06:51 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : మేజర్‌ 
నటీనటులు : అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ, తదితరులు
నిర్మాణ సంస్థలు: జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌
నిర్మాత: మహేశ్‌బాబు, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర
దర్శకుడు: శశి కిరణ్‌ తిక్క
సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
సినిమాటోగ్ర‌ఫి:  వంశీ పచ్చిపులుసు
ఎడిటర్‌ : పవన్‌ కల్యాణ్‌
విడుదల తేది: జూన్‌ 3, 2022

Major Movie Review

క్షణం, గుడాచారి,ఎవరు వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు అడివి శేష్‌. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ మూవీ సూపర్‌ హిట్టే. తాజాగా ఈ యంగ్‌ హీరో నటించిన చిత్రం ‘మేజర్‌’. 26/11 రియల్‌ హీరో మేజర్‌ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా ఢిపరెంట్‌గా, గ్రాండ్‌గా చేయడంతో ‘మేజర్‌’పై అంచనాలు పెరిగాయి. పైపెచ్చు ఈ సినిమా నిర్మాణంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా పాలుపంచుకోవడంతో ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జూన్‌3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మేజర్‌’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో​ చూద్దాం. 

Major Telugu Movie Review

కథేంటంటే..
సందీప్‌ ఉన్ని కృష్ణన్‌(అడివి శేష్‌).. ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి భారత సైన్యంలో పనిచేయాలనే తపనతో జీవిస్తుంటాడు. కానీ అతని తండ్రికి (ప్రకాశ్‌ రాజ్‌) కొడుకుని డాక్టర్‌ చేయాలని, తల్లికి (రేవతి) ఇంజినీరింగ్‌ చదివించాలని ఉంటుంది. చివరికి కొడుకు ఆశయాలకు, ఆలోచనకు వాళ్ల ఇష్టాన్ని చంపుకుంటారు. సోల్జర్‌ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న సందీప్‌.. ఆ దిశగా కష్టపడి ఇండియన్‌ ఆర్మీలో జాయిన్‌ అవుతాడు. స్కూల్‌ డేస్‌లో ఇష్టపడిన ఇషా(సయీ మంజ్రేకర్‌)ని పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆమెతో ఎక్కువ సమయం గడపలేకపోతాడు. దీంతో వీరిమధ్య విభేదాలు వస్తాయి. చివరకు విడాకుల వరకు వెళతారు.

మరోవైపు ఇల్లు, కుటుంబం కంటే దేశమే ఎక్కువ అని భావించే సందీప్‌.. అంచెలంచెలుగా ఎదిగి భారత సైన్యంలో ముఖ్యమైన ఎన్‌ఎస్‌జీ (NSG) కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుతాడు. ఓసారి తను ఇంటికి వెళ్లేందుకు పై అధికారి(మురళీ శర్మ) దగ్గర అనుమతి తీసుకొని బెంగళూరు బయలుదేరుతాడు సందీప్‌. అదే సమయంలో ముంబై తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడతారు. ఆ సమయంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకొని ‘51 ఎస్‌ఎస్‌ జీ’ బృందంతో కలిసి ముంబైకి వెళతాడు. తాజ్‌ హోటల్‌లో దాగి ఉన్న ఉగ్రవాదులను సందీప్‌ ఎలా మట్టుపెట్టాడు? హోటల్‌లో బందీగా ఉన్న సామాన్య ప్రజలను ఎలా కాపాడాడు? ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Adivi Sesh Major Movie

ఎలా ఉందంటే.. 
బయోపిక్‌ మూవీ అంటే.. దర్శకుడికి రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. కచ్చితంగా ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. అది డాక్యుమెంటరీ అవుతుంది. లేదా చొరవ తీసుకొని కమర్షియల్‌ హంగులను జోడిస్తే.. మొదటికే మోసం వస్తుంది. కథతో పాటు అందులోని ఆత్మనూ తీసుకుని తెరకెక్కిస్తే.. ఆ చిత్రాలను ప్రేక్షకులను ఆదరిస్తారు. ఈ విషయంలో దర్శకుడు శశి కిరణ్‌ తిక్క సఫలమయ్యాడు. 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ గురించి తెలియని విషయాలను భారతీయ ప్రేక్షకులకు తెరపై చూపించాడు. ముంబై దాడుల్లో మేజర్‌ ఉన్ని కృష్ణ ఎలా  వీరమరణం పొందారో అందరికి తెలుసు. కానీ ఆయన ఎలా జీవించాడో ఈ సినిమాలో చూపించారు. ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? బాల్యం ఎలా సాగింది? తల్లిదండ్రులపై ఆయనకు ఉన్న ప్రేమ, యవ్వనంలో​ ఉన్న లవ్‌స్టోరీ.. ప్రాణాలకు తెగించి ఉగ్రమూకలను మట్టుబెట్టడం.. ప్రతీదీ కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫస్టాఫ్‌ అంతా ఆయన బాల్యం, లవ్‌స్టోరీతో పాటు దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమను, ఆర్మీలో చేరిన తర్వాత ఉన్నత స్థాయికి ఎదగడానికి పడిన కష్టాన్ని చూపించారు. 

Major Movie Rating

ఆర్మీలో చేరుతా అని సందీప్‌ అన్నప్పుడు.. ‘నీకేమైనా అయితే ఎలా?’ అని తల్లి అడిగితే..‘ప్రతి అమ్మ ఇలానే అనుకుంటే...?’అని సందీప్‌ చెప్పిన డైలాగ్‌ ఆందరికి ఆకట్టుకుంది. ఇషాతో ప్రేమాయణం చాలా రొమాంటిక్‌గా సాగుతుంది. ఇక ఆర్మీలో చేరిన తర్వా త ‘సోల్జర్‌’అంటే ఏంటి అని పై అధికారి అడిగినప్పుడు.. సందీప్‌ చెప్పే సమాధానం ప్రేక్షకుడిలో ఉద్వేగాన్ని కలిగిస్తాయి. అలాగే ట్రైనింగ్‌ సమయంలో సందీప్‌తో పాటు మిగిలిన జవాన్లు పడే కష్టాలను కూడా తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. ఇవన్నీ చూస్తున్నా.. ముంబై దాడిలో ఉగ్రవాదులను ఉన్ని కృష్ణ ఎలా మట్టుపెట్టాడు? దాన్ని తెరపై ఎలా చూపించారు? అనేదే ప్రేక్షకుడికి ఆసక్తికరమైన అంశం.  తాజ్‌ హోటల్‌పై ఉగ్రదాడితో ఫస్టాఫ్‌కి బ్రేక్‌ ఇచ్చాడు.

ఇక సెకండాఫ్‌లో మొత్తం 26\11 ఉగ్రదాడినే చూపించాడు. తాజ్‌ హోటల్‌లో ఉగ్రవాదులు చేసిన అరాచకాలు.. వారిని మట్టుపెట్టేందుకు మేజర్‌ ఉన్నికృష్ణన్‌ పన్నిన వ్యూహాలు.. ప్రాణాలకు తెగించి సామాన్య ప్రజలను కాపాడిన తీరు.. ప్రతీదీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మీడియా వల్ల జరిగిన నష్టం ఏంటో ధైర్యంగా తెరపై చూపించారు. అలాగే అదే మీడియాను మభ్యపెట్టి, ఉగ్రవాదులను ఎలా మట్టుపెట్టిన తీరును కూడా అద్భుతంగా చూపించారు. హోటల్‌లో దాగి ఉన్న సాధారణ యువతి ప్రమోదరెడ్డి( శోభిత ధూళిపాళ), ఓ చిన్న పిల్లను కాపాడడం కోసం పడిన పాట్లు ఆకట్టుకుంటాయి. ఇక చివరి 20 నిమిషాలు మాత్రం ప్రేక్షకులు కుర్చీలకు అతుక్కుని కూర్చునే ఉత్కంఠను కల్పించారు.  ప్రాణాలు పోతాయని తెలిసినా.. సందీప్‌ ఒక్కడే ఉగ్రవాదులు ఉన్న చోటుకు వెళ్లడం.. అక్కడ వారితో జరిపిన వార్‌... ఒంటినిండా బుల్లెట్లు, కత్తిపోట్లు ఉన్నా.. చివరి క్షణం వరకు దేశరక్షణ కోసమే  పాటుపడడం.. క్లైమాక్స్‌లో ప్రకాశ్‌ రాజ్‌ స్పీచ్‌.. ప్రేక్షకులను కంటతడిపెట్టిస్తాయి.  మొత్తంగా ‘మేజర్‌’ అందరూ చూడాల్సిన సినిమా.

Major Movie Story In Telugu

ఎవరెలా చేశారంటే..
మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ పాత్రలో అడివి శేష్‌ నటించడం కంటే జీవించాడు అనే చెప్పాలి. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ఎమోషన్స్‌ పలికిస్తూనే.. హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించాడు.  నిజమైన సైనికుడి మాదిరి తన శరీరాన్ని మార్చుకున్నాడు. ఈ పాత్ర కోసం శేష్‌ పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. ఇక పేరెంట్స్‌  ప్రేమను నోచుకొని ఉన్నత కుటుంబానికి చెందిన  ఇషా పాత్రలో  సయీ మంజ్రేకర్‌ ఒదిగిపోయింది. శెష్‌, సయీల రొమాంటిక్‌ తెరపై వర్కౌట్‌ అయింది. ఇక సందీప్‌ తండ్రిగా ప్రకాశ్‌ రాజ్‌ అద్భుతంగా నటించాడు. ఆయన చెప్పే డైలాగ్స్‌ కంటతడి పెట్టిస్తాయి. హీరో తల్లిగా రేవతి మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు. హోటల్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌ యువతి ప్రమోదారెడ్డిగా శోభిత ధూళిపాళ మంచి నటనను కనబరిచింది. ముఖ్యంగా చిన్న పిల్లను కాపాడడం కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో ఆమెది కూడా ఒక్కటి. ఇక మేజర్‌ సందీప్‌ పై అధికారిగా మురళీ శర్మతో మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

Major Movie Images

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధానమైన బలం శ్రీచరణ్‌ పాకాల సంగీతం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫైట్‌ సీన్స్‌కి తనదైన బీజీఎంతో గూస్‌ బంప్స్‌ తెప్పించాడు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. పవన్‌ కల్యాణ్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(3.25/5)
మరిన్ని వార్తలు