ఆస్కార్‌ అవార్డ్‌ను దున్నుతుందా?

26 Nov, 2020 00:31 IST|Sakshi

ఆస్కార్‌కు ఇండియన్‌ ఎంట్రీ జల్లికట్టు

పోటీ మొదలయింది. ఆస్కార్‌ పరుగులోకి ఒక్కొక్కటిగా సినిమాలను ప్రకటిస్తున్నాయి ఆయా దేశాలు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న  93వ ఆస్కార్‌ అవార్డులకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను ఎంట్రీగా పంపుతున్నట్టు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది.

లీజో జోస్‌ పెలిసెరీ దర్శకత్వం వహించిన మలయాళ  చిత్రం ‘జల్లికట్టు’. ఆంటోనీ వర్గీస్, చెంబన్‌ వినోద్‌ జోస్, శాంతి బాలచంద్రన్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. కసాయి కొట్టు నుంచి తప్పించుకున్న దున్నపోతు చుట్టూ తిరిగే కథ ఇది. ఆ ఊరి మొత్తాన్ని ఆ దున్న ఎలా ఇబ్బంది పెట్టింది, ఈ క్రమంలో అందర్నీ ఎలా మార్చేసింది? అన్నది కథాంశం. ఈ సినిమాకు కెమెరా, ఎడిటింగ్, సౌండ్‌ డిజైనింగ్‌.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లకు మంచి పేరు లభించింది.

2019, అక్టోబర్‌ 4న ‘జల్లికట్లు’ విడుదలైనప్పటి నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, బూసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. 50వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడి ట్రోఫీను అందుకున్నారు లిజో. ప్రతీ ఏడాది మన దేశం నుంచి పంపే సినిమాయే మన రేసు గుర్రం. ఆ గుర్రం గెలుపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. ఈ ఏడాది మన రేసు గుర్రం, ఈ దున్న. ఆస్కార్‌ జ్యూరీ ఎంపిక చేసే తుది జాబితాలో మన సినిమా ఉండాలని, ఆస్కార్‌ తీసుకురావాలని అందరం చీర్‌ చేద్దాం. హిప్‌ హిప్‌ బర్రె!

ఎంట్రీగా పోటీపడ్డ సినిమాలు
ఈ ఏడాది మన దేశం తరఫు నుంచి ఆస్కార్‌ ఎంట్రీగా వెళ్లేందుకు  పలు సినిమాలు ఇవే అని ఓ జాబితా బయటకు వచ్చింది. ఆ జాబితాలో అమితాబ్‌ బచ్చన్, ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, హన్సల్‌ మెహతా ‘చాలెంజ్‌’, ‘ది డిసైపుల్‌’, ‘మూతాన్‌’, ‘కామ్యాబ్‌’, ‘షికారా’, ‘బిట్టర్‌ స్వీట్‌’ వంటి సినిమాలు ఉన్నాయి.

విశేషం ఏంటంటే ‘జల్లికట్టు’ మొత్తం దున్నపోతు చుట్టూ తిరిగినా, ఈ సినిమాలో నిజమైన దున్నను ఉపయోగించలేదు. యానిమేట్రానిక్స్‌ ద్వారా దున్న బొమ్మలను తయారు  చేశారు. సుమారు మూడు నాలుగు దున్నలను తయారు చేశారు ఆర్ట్‌ డైరెక్టర్‌ గోకుల్‌ దాస్‌. ఒక్కో దున్నను తయారు చేయడానికి సుమారు 20 లక్షలు అయిందట.
 

మరిన్ని వార్తలు