ఆస్పత్రిలో చేరిన నిర్మాత సోదరుడు

7 Mar, 2023 18:47 IST|Sakshi

ఇటీవల సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు రోగాల బారిన పడటం కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు నటీనటులు ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరో నటుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మలయాళ నటుడు బాలా కేరళలోని కొచ్చిలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. మలయాళంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ నటించారు బాలా.

బాలా ప్రముఖ తమిళ చిత్రనిర్మాత శివ సోదరుడు. అతను ప్రస్తుతం సూర్య చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆస్పత్రికి వెళ్లిన ప్రముఖులు ఉన్ని ముకుందన్, బాదుషా, వినుషా మోహన్ అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఎన్‌ఎమ్ బాదుషా తన ఫేస్‌బుక్ ఖాతాలో పంచుకున్నారు. 

బాలా చివరిసారిగా అనుప్ పందళం దర్శకత్వం వహించిన షెఫీక్కింటే సంతోషం చిత్రంలో నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రంలో బాలా అమీర్ అనే పాత్రలో కనిపించారు. అనూప్ పందళం స్వయంగా రాసిన ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే కొన్ని తమిళ చిత్రాలలో కూడా పనిచేసిన బాలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో బలంగా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. బిలాల్, స్థలం, మై డియర్ మచాన్స్ సినిమాలతో బాలా ఫేమ్ సంపాదించారు. 

మరిన్ని వార్తలు