Joseph Manu James: తొలి సినిమా విడుదలకు ముందే కన్నుమూసిన డైరెక్టర్‌!

27 Feb, 2023 10:03 IST|Sakshi

మలయాళ నూతన దర్శకుడు జోసెఫ్‌ మను జేమ్స్‌(31) అనారోగ్యంతో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగా హెపటైటిస్‌తో ఫిబ్రవరి 25న తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. కాగా జోసెఫ్‌ మను 'ఐయామ్‌ క్యూరియస్‌' సినిమాతో బాలనటుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ 2004లో రిలీజైంది. కొన్నేళ్ల తర్వాత జోసెఫ్‌ సినీపరిశ్రమ మీద ఉన్న ఆసక్తితో పలు మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

నాన్సీ రాణి సినిమాతో పూర్తిస్థాయిలో దర్శకుడిగా పరిచయం కానున్నారు. తను  తెరకెక్కించిన సినిమా రిలీజ్‌ను చూడకముందే ఆయన మరణించడంతో చిత్రయూనిట్‌ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో అహానా క్రిష్ణ, అర్జున్‌ అశోకన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. జోసెఫ్‌ మృతిపై అహానా సోషల్‌ మీడియాలో భావోద్వేగానికి లోనైంది. 'నీకిలా జరగాల్సింది కాదు మను. నీ ఆత్మకు శాంతి చేకూరుగాక' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. అజు వర్గీస్‌ సైతం 'చాలా త్వరగా వెళ్లిపోయావు బ్రదర్‌' అంటూ నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు