Jaya Jaya Jaya Jaya Hey: మరో మలయాళ సంచలనం.. 42 రోజుల్లో రూ.6 కోట్లతో తీస్తే.. రూ.42 కోట్ల కలెక్షన్స్‌

20 Nov, 2022 11:30 IST|Sakshi

సీనీ ప్రేక్షకులు ఆలోచన మారింది. ఒకప్పుడు స్టార్‌ హీరోహీరోయిన్‌ ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా ఆదరించేవాళ్లు. తమ అభిమాన హీరో అయితే.. సినిమా బాలేకపోయినా థియేటర్స్‌కి వెళ్లి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు వారి ఆలోచనలో మార్పు వచ్చింది. మంచి కంటెంట్‌ ఉంటే చాలు.. హీరో హీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు. దానికి మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘కాంతర’ చిత్రమే. ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్‌ శెట్టి పెద్ద స్టార్‌ హీరో ఏం కాదు. కానీ ఆయన సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో ఆడింది. ఊహించని కలెక్షన్స్‌ తెచ్చిపెట్టింది. తాజాగా మలయాళ చిత్రం ‘జయ జయ జయహే’ కూడా అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది.

పేరున్న నటీనటులేవరు అందులో లేకున్నా.. బాక్సాఫీస్‌ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. మలయాళంలో చిన్న సినిమాగా అక్టోబర్‌ 28న విడుదలైన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా  ఇప్పటికే రూ.42 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను కేవలం 42 రోజుల్లోనే తీయడం మరో విశేషం. 

‘జయ జయ జయహే’ కథేంటంటే..
జయ భారతి(దర్శన రాజేంద్రన్‌) మధ్య తరగతికి చెందిన తెలివైన అమ్మాయి. స్వతంత్ర భావజాలం కలిగిన అమ్మాయి. ఆమె చదువు పూర్తి కాకముందే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. పెళ్లి తర్వాత కూడా తాను చదువుకుంటానని, తన నిర్ణయాన్ని అంగీకరించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని చెబుతుంది. జయ నిర్ణయాన్ని అంగీకరించడంతో పౌల్ట్రీ యజమాని రాజేష్(బేసిల్ జోసెఫ్)తో పెళ్లి జరుగుతుంది.  పెళ్ళి తర్వాత రాజేష్ జయ చదువు వాయిదా వేస్తూ ఇంట్లో జరిగే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలని మొండిగా ఉంటాడు. ఆ తర్వాత జయను శారీరకంగా కూడా హింసిస్తాడు. అది సర్వ సాధారణ వ్యవహారంగా మారటంతో జయ తల్లిదండ్రుల మద్దతు కోరుతుంది. కానీ వారు సర్దుకుపొమ్మని చెబుతారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ రారన్న నిజాన్ని గ్రహించి తదనుగుణంగా చర్యలు తీసుకుని తన కష్టాలకు ఎలా ముగింపు పలికింది అనేది మిగతా కథ. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు