నన్ను నేను తెలుసుకుంటున్నాను!

13 Nov, 2020 00:34 IST|Sakshi

‘రాఖీ రాఖీ రాఖీ.. నా కవ్వాసాకీ...’ అంటూ ‘రాఖీ’లో పాడిన పాట ద్వారా తెలుగు సినిమాకి పరిచయమయ్యారు మమతా మోహన్‌దాస్‌. ముందు తన గొంతును పరిచయం చేసి, తర్వాత తనలోని నటిని ‘యమదొంగ’ ద్వారా తెలుగుకి చూపించారు. మమతామో హన్‌ దాస్‌ సినిమాల్లోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయింది. 2005లో చేసిన మలయాళ చిత్రం ‘మయూకం’ ద్వారా హీరోయిన్‌ అయ్యారామె. ఈ పదిహేనేళ్ల ప్రయాణం గురించి మమతా మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ – ‘‘2004లో దీపావళి బ్రేక్‌లో సరదాగా చేసిన ఓ పని (నటన) నా జీవితం అయిపోతుంది అనుకోలేదు.

పదిహేనేళ్ల పాటు ఈ ఇండస్ట్రీలోనే కొనసాగుతానని అప్పుడు అనుకోనేలేదు. నాలో ఇందిర (‘మయూకం’లో ఆమె పాత్ర పేరు)ను చూసిన హరిహరన్‌ గారికి ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాతో నిలబడ్డ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మ్యూజిక్‌లో పెద్ద బ్రేక్‌ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌ (‘రాఖీ’కి దేవి సంగీతదర్శకుడు)గారికి, నన్ను నమ్మిన నిర్మాతలకు, అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో ఎన్నో చాలెంజ్‌లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ దాటుతూ నన్ను నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాను’’ అన్నారు. ఇటీవలే ఆమె నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. మలయాళంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాను నిర్మిస్తున్నారు మమతా మోహన్‌దాస్‌. 

మరిన్ని వార్తలు