అజయ్‌ దేవ్‌గణ్‌ కారును ముట్టడించిన దుండగుడు

2 Mar, 2021 20:54 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవ్‌గణ్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం నాడు ముంబైలోని గోరేగావ్‌లో అతడు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. రైతులకు మద్దతు తెలపాలని డిమాండ్‌ చేశాడు. హీరో కారును ముందుకు వెళ్లనీయకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంత సేపటి వరకు నానా హంగామా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజ్‌దీప్‌ రమేశ్‌ సింగ్‌గా గుర్తించారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల పోరాటానికి మద్దతుదారుడిగా భావిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌ బాడీగార్డుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్‌దీప్‌ను అరెస్ట్‌ చేశారు.

తాజాగా నిందితుడు అజయ్‌ కారును ముట్టడించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. "పంజాబ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఇతడు వాళ్లు పండించిన ఆహారాన్ని ఎలా తినగలుగుతున్నాడు? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? సినిమాల్లో సగర్వంగా తలపాగా కడతావే.. నీకేమీ సిగ్గుగా లేదా? నన్ను దాటుకుని వెళ్లగలననుకుంటున్నావా? ఎందుకు కారు దిగి మాట్లాడట్లేదు?" అంటూ నిలదీశాడు.

కాగా రైతు ఉద్యమానికి మద్దతిస్తూ ఆ మధ్య అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు ఇండియాలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే భారత అంతర్గత విషయంలో వారి జోక్యాన్ని క్రీడా, సినీ రంగ ప్రముఖులు ఖండించారు. ఈ క్రమంలో అక్షయ్‌ కుమార్‌తో పాటు అజయ్‌ దేవ్‌గణ్‌ సైతం కేంద్రానికి మద్దతూ తెలుపుతూ ట్వీట్‌ చేశారు. అయితే ఇన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సపోర్ట్‌ చేస్తూ ఒక్క మాటైనా మాట్లాడనందుకే ఇలా అతడి కారును అడ్డుకొని ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: రైతు దీక్షలు: సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

మరిన్ని వార్తలు