Manchi Rojulu Vachayi Review: ‘మంచి రోజులు వచ్చాయి’ ఎలా ఉందంటే..

4 Nov, 2021 15:50 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : మంచి రోజులు వచ్చాయి
నటీనటులు : సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌,  అజయ్‌ ఘోష్‌, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ : యూవీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌
నిర్మాత : ఎస్‌కేఎన్‌
దర్శకత్వం : మారుతి
సంగీతం : అనూప్‌ రూబెన్స్‌
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్‌  
విడుదల తేది : నవంబర్‌ 4, 2021

Manchi Rojulu Vachayi Review: ఒకవైపు పెద్ద హీరోలతో  కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో  తనకు నచ్చిన కాన్సెప్ట్‌తో చిన్న చిన్న సినిమాలు తీస్తుంటాడు దర్శకుడు మారుతి. అలా ఆయన తెరకెక్కించిన మరో చిన్న చిత్రమే ‘మంచి రోజులు వచ్చాయి’.దీపావళి సంద‌ర్భంగా నవంబర్‌ 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే..
అతి భయస్తుడైన తిరుమ‌ల‌శెట్టి గోపాల్ అలియాస్ గుండు గోపాల్‌(అజయ్‌ ఘోష్‌)కి  కూతురు పద్మ తిరుమల శెట్టి అలియాస్‌ పద్దు(మెహ్రీన్‌ ఫిర్జాదా) అంటే ప్రాణం. తన కూతురు అందరి ఆడపిల్లలా కాదని, చాలా పద్దతిగా ఉంటుందని భావిస్తాడు. అయితే పద్దు మాత్రం బెంగళూరు సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తూ.. సహోద్యోగి సంతోష్‌(సంతోష్‌ శోభన్‌)తో ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సంతోషంగా ఉండే గోపాల్‌ని చూసి అసూయ పడిన పక్కింటి వ్యక్తులు పాలసీ మూర్తి, కోటేశ్వరరావు.. ఆయనలో లేనిపోని భయాలను నింపుతారు. కూతురు ప్రేమ విషయంలో లేనిపోని అనుమానాలను నింపుతారు. దీంతో గోపాలం కూతురి విషయంలో ఆందోళన చెందడం మొదలుపెడతాడు. ఎలాగైన కూతురికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. ఈ క్రమంలో గోపాల్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రియురాలు పద్దు ప్రేమను దక్కించుకోవడానికి సంతోష్‌ చేసిన ప్రయత్నాలు ఏంటి? అనేదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే..?
ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్‌ ఘోష్‌ పాత్రే. గుండు గోపాల్‌గా అజయ్‌ అదరగొట్టేశాడు. కథ మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. అయినా కూడా ఎక్కడా బోర్‌ కొట్టించకుండా తనదైన కామెడీ యాక్టింగ్‌తో నవ్వించాడు. పద్దుగా మెహ్రీన్‌, సంతోష్‌గా సంతోష్‌ శోభన్‌ పాత్రల్లో పెద్దగా వైవిద్యం కనిపించదు కానీ.. వారిమధ్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. పాలసీ మూర్తిగా శ్రీనివాసరావు అద్భుత నటనను కనబరిచాడు. వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, వైవా హ‌ర్ష‌, స‌ప్త‌గిరి, ర‌జిత త‌దిత‌రులు తమ పాత్రల మేరకు నటించారు.

ఎలా ఉందంటే..
మారుతి  సినిమాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కంటనీరు పట్టిస్తున్నాడు. ‘మంచి రోజులు వచ్చాయి’కూడా అలాంటి చిత్రమే. ‘భయం’అనే అంశాన్ని తీసుకొని ఎప్పటిలానే ఎమోషన్స్ జోడిస్తూ హాస్యంతో కథను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దీనికోసం కరోనా పరిస్థితును కూడా వాడుకున్నాడు. ఫస్టాఫ్‌ అంతా మారుతి మార్క్‌ కామెడీ, పంచులతో సరదాగా గడిచిపోతుంది. డాక్టర్‌గా వెన్నెల కిశోర్‌  ఫ్ర‌స్ట్రేష‌న్‌, సప్తగిరి అంబులెన్స్‌ సీన్స్‌, అప్పడాల విజయలక్ష్మీ ఫోన్‌ కాల్‌ సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కరోనా పరిస్థితుల సన్నీవేశాలు సాగదీతగా అనిపిస్తాయి. అలాగే కథలో ఎలాంటి ట్విస్టులు లేకుండా రొటీన్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌ కూడా సింపుల్‌గా ఊహకందే విధంగా ఉంటుంది.  క్లైమాక్స్‌లో భయం గురించి సాగిన చర్చ ఆలోచింపజేసేదిగా ఉంటుఉంది. ఇక సాంకెతిక విభాగానికి వస్తే.. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం బాగుంది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతం అందించాడు.  సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2.75/5)
మరిన్ని వార్తలు