Manchu Lakshmi: నేను ఏం కొంటే నీకేంట్రా నొప్పి.. నా డబ్బు.. నా ఖర్చు: మంచు లక్ష్మి

23 Sep, 2023 08:00 IST|Sakshi

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. తనకు నచ్చని, నచ్చిన విషయం ఏమైనా తన దృష్టికి వస్తే మాత్రం సోషల్‌ మీడియాలో స్పందిస్తుంది. కొన్నిసార్లు నెటిజన్లు ఆమెపట్ల నెగటివ్‌ కామెంట్లు కూడా చేస్తుంటారు. తను మంచి చెప్పినా కొందరు అదే పనిగా కామెంట్లు చేస్తుంటారు. వాటిని ఆమె తిప్పి కొడుతూనే తన పని తాను చేసుకుంటు పోతుంటుంది. తాజాగా అలాంటి ఘటనే మంచు లక్ష్మీ విషయంలో జరిగింది.

ఇటీవల విమానం ఎక్కేందుకు ముంబయి వెళ్లిన మంచు లక్ష్మి అక్కడ కార్పెట్‌ అపరిశుభ్రంగా ఉండటం గమనించి ఆపై ఎయిర్‌ ఇండియాను ఉద్దేశించి ఒక ట్వీట్‌ చేశారు. ఎయిర్‌ ఇండియా విమానం ఎక్కేందుకు బిజినెస్‌ క్లాస్‌ వాళ్లు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కార్పెట్‌లు శుభ్రంగా లేవని సిబ్బందిని ప్రశ్నిస్తే  వాళ్లు నవ్వి ఊరుకున్నారని తెలిపారు. పరిశుభ్రత అనేది ప్రయాణికుల హక్కు అని ఆమె తెలిపారు. తన ఐఫోన్‌ కెమెరాతో అక్కడున్న అపరిశుభ్రత ఇంకా బాగా కనపడేలా చేసిందని ఆమె ట్వీట్‌ చేశారు. అందుకు గాను ఎయిర్‌ ఇండియా కూడా స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేసింది.

(ఇదీ చదవండి: తెలుగు టాప్‌ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. తొందరపడ్డాడా..?)

కానీ నెటిజన్లు మాత్రం ఆమెపై చేసిన కామెంట్లకు ఇలా స్పందించారు. 'ఇటీవల ఎయిర్‌పోర్ట్‌లో కార్పెట్‌ శుభ్రంగా లేదని వీడియో పెట్టాను. నా ఐఫోన్‌తో తీసిన ఫొటో వల్ల ఇంకా బాగా కనపడుతోందని అన్నాను. అంతే వరుసగా చాలామంది కామెంట్లు చేశారు. వారందురూ ఎలాంటి కామెంట్లు చేశారంటే.. ‘ఓహో.. నువ్వు బిజినెస్‌ క్లాస్‌లో వెళ్తున్నావా? నీకు ఐఫోన్‌ ఉందా’ అంటూ కామెంట్లు చేయడం స్టార్ట్‌ చేశారు.

‘ఇవన్నీ నాకు నువ్వు కొనిచ్చావా’. నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? నేను ఐఫోన్‌ వాడటం తప్పు అన్నట్లు మాట్లాడుతారేంటిరా.. నాకు సొంతంగా విమానం కావాలి? మీకు వద్దా? పెద్దగా ఆలోచించరా? మీకు అన్నీ తప్పులే కనపడుతున్నాయి. నువ్వేదో నాకు డబ్బులు కట్టేట్టు. ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు. ఏదీ చేయకూడదు. సోషల్‌మీడియాలో ఏదీ పోస్ట్‌ పెట్టకూడదు. అసలు మీ సమస్య ఏంటి..? డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతా. మాకు ఎవరూ ఉచితంగా డబ్బు ఇవ్వరు.. చివరకు మా అమ్మానాన్నలు కూడా నాకు డబ్బులు ఇవ్వరు. వారు మాకు కష్టపడటం మాత్రమే చిన్నప్పటి నుంచి నేర్పించారు.

డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నేను వాళ్లతో నేను ఏకీభవించను. నా జీవితంలో ఎంతో డబ్బును చూశా. నేను వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్‌ ఉన్న ఇంట్లో పుట్టి, పెరిగా. కానీ, అమెరికాలో ఉన్నప్పుడు రోజూ తినే తిండికోసం కూడా కష్టపడి పనిచేశా. డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది. డబ్బు ఉంటే పేరు ప్రతిష్ట వస్తుందని భావించకండి. మనం ప్రతి దానికీ తప్పుపట్టకూడదు. జీవితం చాలా చిన్నది. ‘వేరే వాళ్ల కోసం బతికే బతుకు ఒక బతుకేనా?’ ఇతరుల అభిప్రాయాలను గౌరవించు వాటిని ఎత్తి చూపుతూ, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు.' అంటూ మంచు లక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

మరిన్ని వార్తలు