Manchu Vishnu: ఆరు నెలల్లో మా భవనానికి భూమి పూజ: మంచు విష్ణు

16 May, 2022 07:40 IST|Sakshi

Manchu Vishnu Interesting Comments On Maa Building: ‘‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) సభ్యుల ఆరోగ్యం, అవకాశాలు, సంక్షేమం కోసం తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎన్నికల హామీలో భాగంగా ‘మా’కి శాశ్వత భవన నిర్మాణం కోసం ఆరు నెలల్లో భూమి పూజ చేస్తాం’’ అని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో ‘మా’ సభ్యులకు ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘మా’ ఎన్నికల హామీలను 6 నెలల్లోనే 75 శాతం పూర్తి చేశాను. ‘మా’ సభ్యులకు ప్రతి మూడు నెలలకు ఒక హెల్త్‌ క్యాంప్‌ నిర్వహిస్తాం. ‘మా’ సభ్యత్వం నిబంధనలను కఠినతరం చేశాం.. అందుకు డీఆర్‌సీ కమిటీ చైర్మన్‌ కృష్ణంరాజు, సభ్యులు బాలకృష్ణ, మోహన్‌ బాబు, గిరిబాబు, జయప్రద, శివకృష్ణ అమోదం తెలిపారు. కళామతల్లిని నమ్ముకున్న వారే ‘మా’లో సభ్యులుగా చేరాలి. 

సినిమా టెక్కెట్‌ ధరల పెంపు విషయంలో నేను మాట్లాడలేదని నన్ను విమర్శించినా, సైలెంట్‌గా ఉన్నా. ఒక రాష్ట్రంలో టిక్కెట్‌ ధరలు పెంచినందుకు, మరో రాష్ట్రంలో టిక్కెట్‌ ధరలు తగ్గించినందుకు కోర్టులకు వెళ్లారు. అలాగే కొన్ని సినిమాలకు టిక్కెట్‌ రేట్లు పెంచారు. దాని వల్ల విపరీతమైన ఇబ్బంది ఉందని అంటున్నారు. ఏది తప్పు? ఏది ఒప్పు? అనే చర్చ చాలా పెద్దది. దాని గురించి నేను చెప్పేకన్నా తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్, ఫిల్మ్‌ చాంబర్‌ కలిసి చర్చించి, ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘మా’ ఉపాధ్యక్షులు మాదాల రవి, పృధ్వీ, నటుడు వీకే నరేష్, ట్రెజరర్‌ శివబాలాజీ, ఏఐజీ హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, డైరెక్టర్‌ డాక్టర్‌ జీవీ రావు తదితరులు పాల్గొన్నారు.  

చదవండి: టాలీవుడ్‌లో ఎన్టీఆర్, సమంత టాప్‌..
చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత

మరిన్ని వార్తలు